సోనూసూద్ మాట ఇచ్చాడంటే.. అది ఖచ్చితంగా నెరవేర్చుతాడనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అందుకే తమ సమస్యలను ప్రజలు సోనూసూద్‌కు చెప్పుకుంటున్నారు. ప్రజల సమస్యలను వినగానే వెంటనే వారికి సహాయం చేస్తున్నాడు సోనూసూద్. దీంతో సోనూసూద్ నుంచి లబ్ధి పొందినవారు ఆయనను దేవుడితో పోలుస్తున్నారు.
లాక్డౌన్లో ఎంతోమంది వలస కార్మికులను తన సొంత డబ్బులతో వారి సొంతూళ్లకు సోనూసూద్ పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించి ఎంతోమందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాడు.
ఈ క్రమంలో లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోయిన జార్ఖండ్‌కు చెందిన 50 మంది అమ్మాయిలకు సోనూసూద్ ఉద్యోగాలు ఇప్పించాడు. లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోయారనే విషయం తెలుసుకున్న సోనూసూద్.. ఉద్యోగాలు కల్పిస్తానని అక్టోబర్ 5న వారికి హామీ ఇచ్చాడు. ఇచ్చిన హామీ మేరకు తాజాగా వారికి ఉద్యోగాలు కల్పించాడు.
దీంతో సోనూసూద్‌కు ఉద్యోగాలు పొందినవారు ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన సోనూసూద్.. ఎవరికైనా హామీ ఇస్తే నెరవేర్చాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇచ్చిన హామీని నెరవేర్చిన సోనూసూద్‌కు నెటిజన్లు హ్యాట్సఫ్ చెబుతున్నారు.