టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వి.దొరస్వామిరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో భారంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవల బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తుండగా.. ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ వార్తతో టాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. దొరస్వామిరాజు మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

దొరస్వామిరాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 1978వ సంవత్సరంలో విజయ మల్లేశ్వరి కంబైన్స్ అనే సంస్థను స్థాపించిన ఆయన.. ఎన్నో సినిమాలను నిర్మించారు. అలాగే ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆయన నిర్మించిన ఎన్నో సినిమాలకు జాతీయ స్థాయిలోనూ అవార్డులు వచ్చాయి.

అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన సీతరామయ్య గారి మనవరాలు సినిమాను దొరస్వామిరాజు నిర్మించగా.. దీనికి బెస్ట్ ఫిల్మ్‌గా నేషనల్ అవార్డు వచ్చింది. అక్కినేని నాగార్జునతో తీసిన అన్నమయ్య సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ANRతో రెండు సినిమాలు, నాగార్జునతో మూడు సినిమాలు, ఎన్టీఆర్‌తో ఒక సినిమా ఆయన చేశారు.

ఇక శ్రీకాంత్, జగపతిబాబు, మాధవన్ లాంటి హీరోలతో కూడా సినిమాలు తీశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 750 సినిమాలను దొరస్వామిరాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. రాయలసీమ రారాజుగా ఆయనను అందరూ పిలుస్తూ ఉంటారు.