ఇప్పటికీ గీతాంజలి అంటే మన ఎన్టీవోడిని మెప్పించిన సీతనే

అలనాటి నటి గీతాంజలి(62)తుది శ్వాస విడిచారు. గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు ఆమె కన్నుమూశారు. గీతాంజలి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లోనూ కలిపి దాదాపు 500 సినిమాల్లో నటించారు. సహనటుడు రామకృష్ణను పెళ్లి చేసుకున్న గీతాంజలి అసలు పేరు మణి.

artist geethanjali

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి 1961లో ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించి మెప్పించారు. కాలం మారింది, పూల రంగడు, శారద, డాక్టర్‌ చక్రవర్తి, పూలరంగడు, మురళీకృష్ణ, అవేకళ్లు, సంబరాల రాంబాబు, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలు వంటి హిట్‌ సినిమాల్లో నటించి మంచిపేరు సంపాదించారు.

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే భర్త చనిపోవడంతో గీతాంజలి సినిమాలకి పూర్తిగా దూరం అయ్యారు. దాదాపు దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన గీతాంజలి, జగపతి బాబు ప్రియమణి నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాలో బామ్మగా నటించింది. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులని మెప్పించింది, దీంతో బ్యాక్ టు బ్యాక్ 25 సినిమాలు సైన్ చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన గీతాంజలి… మాయాజాలం, భాయ్‌, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమాకి ఆమె లోటు తీరనిదని ఇండస్ట్రీ వర్గాలు, సంతాపం తెలియజేస్తున్నాయి. చనిపోయినా ఇప్పటికీ గీతాంజలి, మన ఏన్టీవోడిని మెప్పించిన సీతగానే గుర్తుండి పోతుంది.