బిగ్‌బి అమితాబచ్చన్ హీరోగా తెరకెక్కిన ‘జుండ్’ సినిమా విడుదలపై స్టే ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. . స్లమ్ సాకర్ ఛాంపియన్ అఖిలేశ్ పాల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తీసిన ఈ సినిమా కాపీరైట్స్ తన దగ్గర ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ నంది చిన్నికుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. అఖిలేష్ కోచ్ విజయ్ బర్సె నుంచి అఖిలేష్ జీవిత కథకు సంబంధించి హక్కులను జుండ్ చిత్ర బృందం అక్రమంగా కొనుగోలు చేసిందని ఆరోపించాడు.
దీంతో ఈ సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ సినిమాను విడుదల చేయడానికి వీల్లేదని తెలిపింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులకు సవాల్ చేస్తూ సూపర్ క్యాసెట్ ఇండస్ట్రీస్ (టి సిరీస్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరగా.. తాజాగా దానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
నాగ్ రాజ్ మంజులే ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇందులో ఉపాధ్యాయుడి పాత్రలో అమితాబ్ నటించాడు. ఒక మంచి సాకర్ టీమ్‌ను ఎలా తయారు చేశాడనే నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించగా.. అంతలోపు కాపిరైట్స్ వివాదం వచ్చింది.