టాలీవుడ్ ఈజ్ బ్యాక్.. సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు

లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడం, థియేటర్లు మూతపడటంతో విడుదల కావాల్సిన చాలా సినిమాలలు ఆగిపోయాయి. దీంతో సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిర్మాతలతో పాటు సినీ కార్మికులు మరింతగా నష్టపోయారు. సినిమాల విడుదల మరింత ఆలస్యం అయితే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉండటంతో.. కొన్ని సినిమాలను నిర్మాతలు ఓటీటీలో విడుదల చేశారు. పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీలో విడుదల అయ్యాయి. ఇలా ఓటీటీలో విడుదలై కొన్ని సినిమాలు హిట్ అవ్వగా.. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

లాక్‌డౌన్ తర్వాత సినిమా షూటింగ్‌లు, థియేటర్లకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి కలిసి వస్తుండటంతో.. సినిమాలను రిలీజ్ చేసేందుకు ఇదే కరెక్ట్ సమయమని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే క్రిస్మస్ సందర్భంగా సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్ అవ్వగా.. బాక్సాఫీస్ దగ్గర ఇది సూపర్ హిట్ అయింది. కలెక్షన్లను బాగానే సంపాదించుకుంటూ విజయవంతంగా ఆడుతోంది.

ఇక నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ‘బొమ్మ అదిరింది… దిమ్మ తిరిగింది’, ‘షకీలా’ బయోపిక్ సినిమాలు విడుదల కానున్నాయి. ఇక సంక్రాంతి పండుగ సమయం సినిమా పరిశ్రమకు చాలా కీలకం. ఈ పండుగ సమయంలో సినిమాలను విడుదల చేస్తే సక్సెస్ అవుతాయని నమ్ముతారు. దీంతో రానున్న సంక్రాంతి సందర్భంగా ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమయ్యారు.

విజయ్ హీరోగా వస్తున్న మాస్టర్, రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్, రవితేజ్ హీరోగా వస్తున్న క్రాక్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. మాస్టర్ సినిమా సంక్రాంతి 13న విడుదల చేస్తున్నట్లు ఇవాళ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక రెడ్ సినిమా, క్రాక్ సినిమాలు జనవరి 14న విడుదల కానున్నాయి. అల్లు అదుర్స్ సినిమా జనవరి 15న విడుదల కానుంది. ఇలా ఒకేసారి నాలుగు సినిమాలు వస్తుండటంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీ మళ్లీ పాత రోజులకు తిరిగి వచ్చిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.