మాస్ మహారాజ ‘క్రాక్’ కిర్రాక్ ఉంది… ఇక కిక్కే కిక్కు…

కిక్ సినిమాతో తెలుగు ప్రేక్షలకి మంచి కిక్ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ, ఈసారి క్రాక్ గా రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ర‌వితేజ 66వ చిత్రంగా రాబోతున్న ఈ క్రాక్‌ గురువారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు ప్రొడ్యూస్ చేస్తున్న క్రాక్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో దిల్‌రాజు, డి.సురేష్‌బాబు, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, సురేంద‌ర్ రెడ్డి, రాఘ‌వేంద్ర‌రావు, అల్లు అర‌వింద్‌, సుధాక‌ర్ రెడ్డి, న‌వీన్ ఎర్నేని, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, దాము, బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌, రామ్ తాళ్లూరి త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు స‌న్నివేశాకి అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్‌రాజు, సురేంద‌ర్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు.

డాన్‌శీను, బ‌లుపు వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ క్రాక్‌. ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ర‌వితేజ క్యారెక్ట‌ర్‌లోని ప‌వ‌ర్‌ను లాంచ్ రోజే చూపించాలి అనుకున్నాడో ఏమో కానీ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని, ఈ సినిమాకు టైటిల్‌ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. గ‌డ్డం, మెలితిప్పిన మీసంతో రవితేజ డిఫ‌రెంట్ లుక్‌లో కనపడనున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ – మా `క్రాక్‌` మూవీ ఓపెనింగ్‌కి వ‌చ్చిన అతిథులంద‌రికీ థ్యాంక్స్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన యథార్థ‌ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా ఉంటుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ఇన్‌టెన్స్ క‌థ‌. ఈ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మెర్స‌ల్‌, బిగిల్‌ వంటి చిత్రాల‌కు సినిమాటోగ్ర‌ఫీ అందించిన జి.కె.విష్ణు ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు.