సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లడం లేదని సంచలన ప్రకటన చేశారు. అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాల్లోకి వెళ్లడం లేదని ట్విట్టర్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31న పార్టీని ప్రకటించడం లేదని రజనీ తెలిపారు. అభిమాలు తనకు సహకరించాలని, ఎలాంటి బాధకు గురికావొద్దని సూచించారు.
అభిమానుల ఒత్తిడితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు గత కొద్దిరోజుల క్రితం రజనీకాంత్ ప్రకటించారు. డిసెంబర్ 31న పార్టీ గురించి ప్రకటన చేస్తానని, జనవరిలో కొత్త పార్టీని ప్రారంభిస్తానని చెప్పారు. దీంతో రజనీ అభిమానులు ఫుల్ ఖుషీ అయి సంబరాలు కూడా చేసుకున్నారు. త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారని, జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి లాగా సీఎం అవుతారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లడం లేదని రజనీకాంత్ చేసిన ప్రకటనతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. కొద్దిరోజుల్లోనే రజనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వెనుక కారణం ఏంటనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇటీవల హైబీపీ కారణంతో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్లో రజనీకాంత్ చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే స్పెషల్ ప్లైట్‌లో చెన్నైకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం లేదని రజనీ ప్రకటన చేయడం గమనార్హం.