సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్తలు సినీ ప్రముఖులు, అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. దీంతో ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. హైబీపీ కారణంగా శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో రజనీ చేరారు. బీపీని అదుపులోకి తెచ్చేందుకు చికిత్స అందిస్తున్నామని, ఆయనకు ఇక ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని అపోలో హాస్పిటల్ యాజమాన్యం నిన్న ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బీపీ అదుపులోకి రాగానే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని, ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని చెప్పింది.
ఈ క్రమంలో రజనీ తాజా ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం మరో ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో రెండు రోజుల పాటు ఆయన ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని తెలిపింది మరోసారి రజనీకి కరోనా పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన పరీక్షలు చేయబోతున్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. రక్త సరఫరాలో హెచ్చు తగ్గులు ఉండటం వల్ల రజనీకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు.
గత 10 రోజుల క్రితం తాను నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ కోసం రజనీ హైదరాబాద్ వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో సినిమా యూనిట్‌లోని ఏడుగురు సభ్యులకు కరోసా సోకింది. దీంతో షూటింగ్‌ను మధ్యలోనే ఆపివేశారు. ఈ సందర్భంగా రజనీ కరోనా టెస్టు చేయించుకోగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ లోపే రజనీ హైబీపీ కారణంగా అపోలో హాస్పిటల్‌లో చేరారు. రజనీ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థిస్తున్నారు.