తీవ్ర అస్వస్థతతో డిసెంబర్ 25న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్‌ను వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు అపోలో వైద్యులు తెలిపారు. హైబీపీ కారణంగా రజనీ హాస్పిటల్లో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన కోలుకోవాలంటూ ప్రార్థనలు, పూజలు చేశారు. ఇప్పుడు వైద్యులు చికిత్స అందించడంతో బీపీ అదుపులోకి వచ్చింది. దీంతో కొద్దిసేపటి క్రితం రజనీకాంత్‌ను డిశ్చార్జ్ చేశారు.
అయితే వారం రోజుల పాట విశ్రాంతి తీసుకోవాలని రజనీకాంత్‌కు వైద్యులు సూచించారు. ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనవద్దని సూచించారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు చిన్న చిన్న వ్యామాయాలు చేయాలని రజనీకి వైద్యులు సూచించారు. గతంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న కారణంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రజనీకాంత్ చెన్నైకి చేరుకోనున్నారు. గత పది రోజుల క్రితం తాను నటిస్తున్న’ అన్నాత్తై’ సినిమా షూటింగ్ రజనీ హైదరాబాద్ వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్న క్రమంలో సినిమా యూనిట్ సభ్యుల్లో ఏడుగురికి కరోనా సోకడంతో… షూటింగ్ ఆపివేశారు. రజనీకాంత్ కరోనా టెస్టు చేయించుకోగా.. నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.