స్పై పాత్రలో బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ‘BB3’ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో దీని షూటింగ్ జరుగుతోంది. త్వరలో దీని షూటింగ్ ముగియనుండగా.. బాలయ్య తర్వాతి చేసే సినిమాపై చర్చ జరుగుతోంది. దీని తర్వాత బాలయ్య ఎవరి డైరెక్షన్‌లో సినిమా చేస్తారనేది ఇంకా కాన్ఫామ్ కాలేదు. అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్‌లలో ఒకరితో చేస్తారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

BALAYYA

తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్‌లో బాలయ్య సినిమా ఉంటుందట. బాలకృష్ణతో నరసింహానాయుడు వంటి సూపర్ హిట్ సినిమాను గోపాల్ తెరకెక్కించాడు. గత కొంతకాలంగా డైరెక్షన్‌కు దూరమైన గోపాల్.. తిరిగి బాలయ్య సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే సాయి మాధవ్ బుర్ర, ఆకుల శితో పాటు యంగ్ డైరెక్టర్లతో కలిసి ఒక కథను బి గోపాల్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట.

ఈ సినిమాలో బాలయ్య స్పై పాత్రలో కనిపించనున్నాడట. యాక్షన్ సినిమాలను గోపాల్ పెట్టింది పేరు. దీంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.