జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బెదిరింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న జనసైనికుడు వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వెంగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెంగయ్య నాయుడు కుటుంబానికి రూ.8 లక్షల 50 వేలు జనసేన తరపున ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారి పిల్లల చదువులు బాధ్యతలను తానే తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా భావేద్వేగంతో మాట్లాడిన పవన్.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన కార్యకర్తలతో పెట్టుకుంటే రోడ్డుపైకి వచ్చి గొడవ పెట్టుకుంటామని, ఎవరో ఒకరి తల తెగిపోవాల్సిందేనని పవన్ ఘాటుగా మట్లాడారు. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని, లేకపోతే యుద్ధం మొదలుపెడతామని పవన్ హెచ్చరించారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అన్నా రాంబాబు.. ఇప్పుడు మమ్మల్ని చంపేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా అని పవన్ వ్యాఖ్యానించారు. జనసైనికుల జోలికి వస్తే ఖాళీగా కూర్చునే వ్యక్తిని కాదన్నారు. తాను వచ్చి వైసీపీ నేతల ఇళ్ల ముందు కూర్చుంటే పశ్చాతాపానికి కూడా అవకాశం ఉండదని పవన్ హెచ్చరించారు.