తొలిసారి ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా రూ.200, రూ.2 వేల నోట్లను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పరిణామంతో ప్రజలు కొద్దిరోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డబ్బుల కోసం గంటల కొద్దీ ఏటీఎంలు దగ్గర క్యూ కట్టారు. అవినీతి, బ్లాక్ మనీని నిరోధించేందుకే పాత నోట్లను రద్దు చేసినట్లు అప్పట్లో కేంద్రం ప్రకటించింది. కానీ మనీ మొత్తం వెనక్కి రావడంతో.. బ్లాక్ మనీని అరికట్టాలన్న కేంద్ర ప్రభుత్వం ప్లాన్ వర్కౌట్ కాలేదు.
అయితే ఇప్పుడు మరోసారి పాత నోట్లను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ జనరల్ మేనేజర్ బి.మహేశ్ తెలిపారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జిల్లా స్థాయి సెక్యూరిటీ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. మార్చి లేదా ఏప్రిల్లోగా రూ.100, రూ.10, రూ.5 నోట్లను చెలామణిలో లేకుండా చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.