ఓ విశ్వవిఖ్యాత… నీ ఘనత, నీ చరితా మాకు భగవద్గీత

ఒకటే దేహం… ఎత్తు అయిదు అడుగుల ఎనిమిది అంగుళాలు, బరువు 78 కిలోలు. పుట్టింది నిమ్మకూరు, పెరిగింది తెలుగు ప్రజల గుండెల్లో. పేరు కూడా చెప్పకుండా నాలుగు పదాలు చెప్తేనే ఇది నందమూరి తారకరామారావు గారి గురించే అనే విషయం అందరికీ అర్ధం అయ్యింది చూశారా? అది ఆయన గొప్పదనం. ఎన్టీఆర్… ప్రజలు ఆయన ధైర్యం, ప్రజాసేవ ఆయన సిద్ధాంతం, నిజాయతీ ఆయన స్వభావం. మూడు అక్షరాల పేరు తెలుగు సినిమాని మూడున్నర దశాబ్దాల పాటు శాశించగలవా? ఢిల్లీ నాయకుల పీఠాలు కదిలించగలవా? కదిలించగలవు… అది ఆయన చేసి చూపించాడు.

కృష్ణ జిల్లాలోని నిమ్మకూరులో నివాసముంటున్న లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు 1923 మే 28న సాయంత్రం 4:32 నిమిషాలకి పుట్టిన రామారావు గారికి మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, కుటుంబ సభ్యులు తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. మేనమామ పెట్టిన ఆ తారక రాముడి పేరు ఆ తర్వాతి కాలంలో ఎన్టీఆర్ అవుతుందని, అతను తెలుగువాడి గౌరవానికి కీర్తి పతాకంలా నిలబడతాడు అని ఆ రోజు వాళ్లు ఊహించి ఉండరు. విజయవాడ మునిసిపల్ స్కూల్ లో పదవ తరగతి వరకూ చదివి, ఆ తరువాత విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడి నుంచే నాటకాల బాట పట్టిన ఎన్టీఆర్ మొదటి నాటకంలోని ఆడ వేషం వేసి మెప్పించాడు. ఇలా నాటకాలు వేస్తూ చదువు కొనసాగించిన ఎన్టీఆర్, 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. అందరూ చదువుకోకుండా ఆ నాటకాలు ఎందుకు అన్నారు. పట్టుదల ఉన్న మనిషి కదా ఓటమిని ఒప్పుకోలేదు. గుంటూరుకి మకాం మార్చి ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. ఇక్కడ నుంచి చదువు కొనసాగించిన ఎన్టీఆర్, నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి ఎన్నో నాటకాలు ఆడాడు.

గుంటూరులో చదువుకుంటున్న సమయంలోనే రామారావుగారి కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంది. దీంతో ఎన్టీఆర్ పాల వ్యాపారం, కిరాణా కొట్టు, ప్రింటింగ్ ప్రెస్ నడిపాడు. 1947లో బి.ఏలో డిగ్రీ పాస్ అయిన రామారావు గారు, మద్రాసు సర్వీసు కమిషన్ పరీక్ష రాసాడు. ఈ పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో రామారావు ఒకడుగా అంటే ఆయన తెలివి ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారుగా ఉద్యోగం లభించింది, ఇక నందమూరి కుటుంబ ఆర్ధిక సమస్యలు తీరిపోయాయి… రామారావు బసవతారకమ్మతో కలిసి సంతోషంగా ఉంటాడని బంధువులు భావించారు. ఉద్యోగానికే పొంగిపోతే ఆయన ఎన్టీఆర్ ఎందుకు అవుతాడు? హీరో కావాలనే కోరికతో ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు. బంధువులతో పాటు తల్లి తండ్రులు కూడా ఎన్టీఆర్ కి ఏం అయ్యింది? ఎందుకు మంచి జీవితాన్ని ఇలా నాశనం చేసుకుంటున్నాడు అన్న వాళ్లే. ఒక్క తారకమ్మా మాత్రమే ఎన్టీఆర్ ని నమ్మింది, వెనకుండి ఆయన్ని ముందుకి నడిపింది. ఎన్టీఆర్ మద్రాస్ ట్రైన్ ఎక్కడం, తెలుగు సినిమా చరిత్ర మారడానికి పునాదులు పడడం ఒకేసారి మొదలయ్యింది.

ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే అతనును మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. మొదటి సినిమాకే వెయ్యి నూట పదహార్ల పారితోషికం రావడంతో ఎన్టీఆర్ ఉద్యోగానికే రాజీనామా చేశాడు. మద్రాస్ వచ్చిన వెంటనే అవకాశం అయితే వచ్చింది కానీ సినిమా షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. ఈలోపు ఆర్ధిక ఇబ్బందులు మళ్లీ మొదలయ్యాయి, నీళ్లు అయినా తాగి పడుకునే వాడు కానీ అప్పు చేయడం అలవాటు లేని ఎన్టీఆర్ కి మనదేశం సినిమాలో అవకాశం వచ్చింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఎన్టీఆర్ ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు ఆవేశంలో ఎన్టీఆర్ నిజంగా కొట్టడం చూసి దర్శక నిర్మాతలే ఆశ్చర్యపోయారు. 1950లో పల్లెటూరి పిల్లతో పాటు ఎల్వీ ప్రసాదు గారు తీసిన షావుకారు కూడా విడుదలైంది. ఇక్కడి నుంచే ఆయన సినీ జీవితం మలుపు తిరిగింది. ఆయన ధైర్యమో లేక నేను ఉండబోయేది ఇక్కడే అనే దృఢసంకల్పమో, ఇది నా స్థానం అనే నమ్మకమో తెలియదు కానీ కేవలం రెండు సినిమాలకే మద్రాసుకు మకాం మార్చేశాడు. 1950లో రామారావుగా మాత్రమే తెలిసిన తెలుగు ప్రజలకి 1951లో పాతాళ భైరవితో ఎన్టీఆర్ అయ్యాడు. ఈ సినిమా సృష్టించిన రికార్డుల సాధించిన వసూళ్లు ఆయన్ని స్టార్ ని చేశాయి. మూడు సినిమాలకే ఎన్టీఆర్ పేరు దక్షిణాది మొత్తం రీసౌండ్ వచ్చేలా వినిపించింది. ఇక్కడి నుంచి మూడున్నర దశాబ్దాల పాటు ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసింది లేదు. 1950 నుంచి 1960 వరకూ వేల నుంచి లక్షలు తీసుకునే స్థాయికి ఎదిగిన ఎన్టీఆర్ ఈ కాలంలో మల్లేశ్వరి, మిస్సమ్మ, మాయాబజార్, పండు రంగ మహత్యం, భూకైలాస్, ఇంటి గుట్టు సంపూర్ణ రామాయణం, బాలనాగమ్మ లాంటి సినిమాలు చేశాడు. పైన చెప్పిన సినిమా పేర్లు ఎన్టీఆర్ కే కాదు తెలుగు సినిమాకే కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి.

1960లో శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలో కలియుగ వడ్డీ కాసుల వాడిగా కనిపించిన ఎన్టీఆర్. 1961లో వచ్చిన సీతారామ కళ్యాణం సినిమాలో మరోసారి రాముడిగా కనిపించాడు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా కూడా ఇదే. 60-70ల దశకంలో 119 సినిమాలు చేసిన ఎన్టీఆర్ ఒక లెజెండ్ గా మారిపోయాడు. దేవుడిగా చేసినా ఆయనే, రాక్షసుడిగా చేసినా ఆయనే. నాయకుడు అయినా ఆయనే, ప్రతినాయకుడు అయినా ఆయనే అనే అంతలా పేరు తెచ్చుకున్నాడు. ఈ దశాబ్దంలోనే ఎన్టీఆర్ ని ప్రజలు దేవుడిగా చూడడం ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా 1963లో వచ్చిన లవకుశ సినిమా చూసిన తర్వాత రామారావు బొమ్మని రాముడి రూపంలో పూజించడం మొదలుపెట్టారు. నాకు తెలిసినంత వరకూ, మా పెద్దల నుంచి విన్నంత వరకూ అప్పటివరకూ ఊహా చిత్రంగా ఉన్న రాముడికి రూపం ఇచ్చింది ఆయనే. దేవుడు అంటే ఆయనేనేమో అనేలా రామారావుగారు ఉండేవారట.

1977 వరకూ ఆయన చేసిన సినిమాలు ఒకెత్తు అయితే 1997లో వచ్చిన దాన వీర సూర కర్ణ మరో ఎత్తు. ఒక మనిషి తనే దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా చేస్తూ మూడు పత్రాలు పోషిస్తూ ఒక సినిమా చేయడం… అది కూడా 43 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో రికార్డులకు కేంద్ర బిందువు అయిన దాన వీర సూర కర్ణ సినిమా 1977 జనవరి 14న సంక్రాంతి పండగ కానుకగా 4 గంటల 24 గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అప్పట్లోనే కోటి రూపాయల పైన వసూళ్లు చేసిన DVSN సినిమాని ఏ రోజుకైనా జూనియర్ ఎన్టీఆర్ చేస్తే చూడాలని నందమూరి అభిమానుల కోరిక కూడా. తాతకి తగ్గమనవడు మరి ఆ పాత్రలో ఎప్పుడు కనిపిస్తాడో చూడాలి. దాన వీర సూర కర్ణ విడుదలైన 1977లోనే రిలీజ్ అయిన మరో సినిమా అడవి రాముడు. ఎన్టీఆర్ నటించిన మొదటి సాంఘికం, ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటూ ఎన్టీఆర్ జయప్రద డాన్స్ చేస్తుంటే తెలుగు సినీ అభిమానులు థియేటర్ లో డబ్బులు ఎగరేశారు. ఇదే ఏడాది వచ్చిన మరో క్లాసిక్ యమగోల. మొట్టమొదటి సోషియో ఫాంటసీ సినిమా. ఇప్పటికీ ఎన్నో తెలుగు సినిమా కథలకి ఈ యమగోల ఇన్స్పిరేషన్. మనిషి మరణించి నరకానికి వెళ్లి యముడిని ఒక ఆట ఆడుకుంటే ఎలా ఉంటుందో? ఈ యమగోల సినిమాలో చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, అప్పుడు సొసైటీలో ఉన్న పరిస్థితులని ప్రశ్నిస్తూ ఎమర్జెన్సీపై చురకలు వేశాడు. ఈ సినిమా వచ్చిన రెండేళ్ళకి ఎన్టీఆర్ వేటగాడు అవతారం ఎత్తాడు. రామారావు రాఘవేంద్ర రావు కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ 1979లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టీవిలో వేసినా చూసే వాళ్లు ఉన్నారు. శ్రీదేవి ఎన్టీఆర్ పక్కన నటించిన మొదటి సినిమా ఇదే. ఆకు చాటు పిందె తడిసె అనే పాట థియేటర్ లో వినిపిస్తే, అభిమానులు శ్రీదేవి అందంలో తడిసి ముద్దయ్యారు. అప్పట్లోనే వేటగాడు సినిమా ఆరు కోట్ల గ్రాస్ మూడు కోట్ల షేర్, 3.43 కోట్ల ఫుట్ ఫాల్స్ రాబట్టింది అంటే వేటగాడు మూవీ రేంజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

1980లో దాసరి నారాయణ రావు గారు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సర్దార్ పాపా రాయుడు. బ్రిటిష్ వాళ్లనే కాదు ఢిల్లీ నాయకులని కూడా ఆయన కదిలించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది ఈ సినిమాతోనే. సర్దార్ పాపా రాయుడు షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్, ప్రజాక్షేత్రంలోకి రావాలనుకుంటున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించాడు. ఈ ప్రకటన అప్పట్లో ఒక ప్రకంపన. ఢిల్లీ పీఠాలు కదలడానికి, వారి కోటకి బీటలు వారడానికి పునాది పడింది ఈ ప్రకటనతోనే. 1982 మార్చ్ 13న కలియుగ రాముడు రిలీజ్ అయ్యింది, 1982 మార్చ్ 29న ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారానికి చెరమగీతం పాడిన తెలుగు దేశం పార్టీని స్థాపించాడు. ఇది తెలుగు వాడి పార్టీ, తెలుగు దేశం పార్టీ, శ్రామికుడి రక్తంలో నుంచి పుట్టింది ఈ పార్టీ అని ఆయన పార్టీ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తే ఆ గర్జన ఢిల్లీ వరకూ వినిపించింది.

తెలుగువారి “ఆత్మగౌరవ” నినాదంతో ప్రచారం చేసి, పార్టీ పెట్టిన 9 నెలలలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని “ఇందిరా గాంధీ” హేళనకు గట్టి ప్రజలు ఇచ్చిన ఎన్నికల తీర్పు దేశం మొత్తం తిరిగి తెలుగు నేల వైపు చూసేలా చేసింది. అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను తెలుగు దేశం పార్టీ 35 స్థానాలను గెలుచుకోని అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది. దేశం అంతా చేతి గుర్తు గాలి వీస్తుంటే, తెలుగు నేలపై మాత్రం తెలుగు దేశం పసుపు జెండా రెపరెపలాడింది. ఎన్టీఆర్, ఒక ప్రాంతీయ పార్టీని గెలిపించి ఆ తర్వాత 1989లో దేశంలోని చిన్నా చితక పార్టీలన్నింటినీ ఒకతాటిపైకి తీసుకోని వచ్చి నేషనల్ ఫ్రంట్ ని స్థాపించి కాంగ్రెస్ కోటని కూల్చి వీపీ సింగ్ ని ప్రధాన మంత్రిని చేశాడు. కాంగ్రస్ లాంటి నేషనల్ పార్టీకి ఒక నాయకుడి ఆలోచనా విధానం చెక్ పెట్టడం ఇదే మొదటిసారి. రూపాయికి కిలో బియ్యం ఇచ్చినా, ఒక్క రూపాయినే జీతంగా తీసుకున్నా అది ఆయనకి మాత్రమే చెల్లింది. సినిమాల్లో రాముడిగా నటించిన ఎన్టీఆర్, నిజజీవితంలో రామయ్య పాలనే తెచ్చాడు. రామయ్య రాజ్యంలో అందరూ సుఖసంతోషాలతో ఉన్నారు. సినిమాలు రాజకీయాలు ఒకేసారి బాలన్స్ చేస్తూ వచ్చిన ఎన్టీఆర్, మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజలకి సేవ చేశారు. 1985లో బసవ తారకమ్మ మరణించారు. ఈ సంఘటన తర్వాత రామారావుగారి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అవన్నీ తట్టుకోని నిలబడిన ఆయన 1996 జనవరి 18న మరణించారు. ఒక ధ్రువ తార నేలకొరిగిన రోజది. ఒక నాయకుడు అస్తమించిన రోజది. తెలుగు నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయాం అని విలపించిన రోజది. ఆ మహానేత, మహానాయకుడు, ఒక మహానటుడు మరణించిన రోజది.

ప్రజల చేత దేవుడిగా కొలువబడే ఎన్టీఆర్ కి 11 మంది సంతానం కాగా వారిలో పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరిలో నందమూరి బాలకృష్ణ తండ్రి నటనా కీర్తిని కొనసాగిస్తూ ఉండగా పెద్ద కొడుకు హరికృష్ణ ఇటీవలే మరణించాడు. ఎన్టీఆర్ కి ఆత్మలా ఉన్న హరికృష్ణ మరణం కూడా ఎందరినో కలచి వేసింది. హరికృష్ణ కొడుకు అయిన జూనియర్ ఎన్టీఆర్ తాత రూపంతో పుట్టి ఆయన లేని లోటు తీరుస్తున్నాడు, సినిమాల్లో తాతకి తగ్గ మనవడిగా రాణిస్తున్నాడు.

నేటికీ ఎన్టీఆర్ పుట్టి 98 సంవత్సరాలు… తెలుగు సినిమాకి కానీ సంఘానికి కానీ ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవి. స్నేహానికి ఎంతో విలువిచ్చిన ఎన్టీఆర్ పొందని అవార్డు లేని సాధించని ఘనత లేదు. హిందీలో స్ట్రెయిట్ గా మూడు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చినా, హాలీవుడ్ లో The Lord Krishna అనే సినిమా చేసే అవకాశం వచ్చినా నా జీవితం తెలుగు వారికే అంకితం అని చెప్పిన ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే అయి ఉంటాడు. తెలుగు వారంతా కలిసి అన్నగారికి భారత రత్న పురస్కారం వచ్చేలా కృషి చేస్తే ఆయనకి అదే ఒక నివాళి. ఆయనకి మనం ఇచ్చే ఘనమైన నివాళి.

ఓ విశ్వా విఖ్యాత! నీ గాద నీ బోధ మాకు భగవద్గీత, నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవిత… అమరపురి అధినేత అందుకో మా జ్యోత. అందుకో మా జ్యోత.