నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ సంస్థ తొలి చిత్రం !

ఆదిత్య మ్యూజిక్ అనేది సంస్థ మాత్ర‌మే కాదు. అది ఒక బ్రాండ్‌. సంగీత ప్రియులంద‌రికీ ఆదిత్య మ్యూజిక్‌తో ఉన్న అనుబంధం అత్యంత ప్ర‌త్యేక‌మైన‌ది. గ‌త మూడు ద‌శాబ్దాలుగా సంగీత రంగంలో త‌న‌దైన ముద్ర‌వేసిన ఆదిత్య మ్యూజిక్ తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. తెలుగులో నిర్మించ‌బోతున్న త‌మ తొలి సినిమాకు హీరోగా నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌ను ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది 118 సూప‌ర్ స‌క్సెస్‌తో జోరుమీదున్నారు క‌ల్యాణ్‌రామ్‌. ఆయ‌న హీరోగా నటించ‌నున్న ఈ సినిమాకు జాతీయ పుర‌స్కారాన్ని అందుకున్న శ‌త‌మానం భ‌వ‌తి చిత్ర ద‌ర్శ‌కుడు వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ మ‌ధ్య‌నే ఎఫ్‌2తో హ‌నీ ఈజ్ ద బెస్ట్ అనే మ్యాన‌రిజ‌మ్‌తో మార్కులు కొట్టేసిన నార్త్ ఇండియ‌న్ భామ మెహ‌రీన్ నాయిక‌గా న‌టించనున్నారు. జెంటిల్‌మ‌న్, స‌మ్మోహ‌నం వంటి అభిరుచి గ‌ల హిట్ చిత్రాలు తీసిన‌ శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ స‌మ‌ర్పిస్తున్న ఈ సినిమాకు, గీత గోవిందం, మ‌జిలీ వంటి మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ చిత్రాల సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ అల‌రించేలా ద‌ర్శ‌కుడు క‌థ‌ను సిద్ధం చేసుకున్నార‌ని చిత్ర నిర్మాత ఉమేష్ గుప్త తెలిపారు.