తొలిప్రేమకు తొవ్వ చూపుతోన్న ‘ దొరసాని ’ పాట

దొరసాని.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్న సినిమా. ఫస్ట్ లుక్ నుంచి టీజర్ వరకూ ఒక్కసారిగా అంచనాలు పెంచిన సినిమా ఇది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఓ పాట విడుదల చేశారు. వయసులో ఉన్న కుర్రకారు తొలిసారిగా ప్రేమలో పడినప్పుడు కలిగిన భావనలను తెలంగాణ మాండలికపు సాహిత్యంతో అందమైన భావుకతను జోడించి వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న రాసిన పాట ఇది. ప్రశాంత్ ఆర్ విహారి స్వరరచనలో వినగానే ఆకట్టుకునేలా తొలిప్రేమ తాలూకూ భావనలను మరోసారి తట్టిలేపుతుంది. ఆ భావనలకు అంతే అందంగా తన గాత్రంతో ప్రాణం పోశాడు గాయకుడు అనురాగ్ కులకర్ణి.

రెక్కలు తొడిగిన మనసు ‘నింగిలోని పాలపుంత నవ్వులొంపెనే.. నేలపైన పాల పిట్ట తొవ్వగాసెనే.. వేకువమ్మ పూలతోట రేకులిప్పెనే.. సుక్కలన్ని ముగ్గులై సిగ్గులొలికెనే.. పరువం కడలై పొంగి పరుగులెత్తెనే’.. అంటూ సాగే ఈ పాట విన్నా కొద్దీ వినాలనిపించేలా ఉంది. సినిమాలో మాంటేజ్ సాంగ్ లా కనిపిస్తోంది కాబట్టి.. వెండితెరపై మరింత అందంగా ఉంటుంది. మొత్తంగా ఈ పాటతో దొరసానిపై అంచనాలు మరింత పెరుగుతాయి.

పీరియాడిక్ ఫిల్మ్ గా వస్తోన్న ఈ చిత్రం కొన్నేళ్ల క్రిందటి తెలంగాణ గడీలోని దేవకి అనే దొరసానికి రాజు అనే ఓ సాధారణ యవకుడికి మధ్య సాగే ప్రేమకథ. ఆ ఇద్దరి మధ్య అంతరాలు వారి ప్రేమను ఏ తీరాలకు చేర్చాయి. ఈ ప్రేమను నాటి దొరలు ఒప్పుకున్నారా లేదా.. అనేది కథ. కొన్ని వాస్తవ సంఘటనల చుట్టూ అల్లుకున్న దొరసాని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.

ఆనంద్ దేవరకొండ హీరోగా, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్ టైన్ మెంట్ మరియు బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై వస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర