‘నా ప్రేమ కథా చిత్రం’ సినిమా ప్రారంభం

జె.యల్.14 రీల్ సినిమా ప్రొడక్షన్ బ్యానర్‌పై జె.వి.మోహన్ గౌడ్ సమర్పణలో యస్.కె.జలీల్ నిర్మాతగా రాజశేఖర్ సుధాపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘నా ప్రేమ కథా చిత్రం’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లోని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హాల్‌లో ఈ రోజు ఘనంగా జరిగాయి. ఇందులో సంతోష్, పవన్, ప్రసూనా చంద్రిక, శైనా నాయుడు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. మా అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శివాజీ రాజా ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టగా.. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ కెమెరా స్వీచ్ ఆన్ చేశారు.

MOVIE START

సుఖీభవ ప్రాపర్టీస్ అధినేత ఏ.గురు రాజ్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ పూజా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరూ సినిమా యూనిట్‌కి అభినందనలు తెలిపి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు జె.వి మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ చెప్పిన కథ నచ్చి పార్టనర్‌గా చేరడానికి ఒప్పుకున్నానని, సినిమా బాగా రావడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఇక నిర్మాత యస్.కె. జలీల్ మాట్లాడుతూ.. మోహన్ గౌడ్ గారు మా టీంలో చేరడం మా అదృష్టమని, ఆయన అనుభవం మేము అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయడానికి ఉపయోగపడుతుందన్నారు. జనవరి 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందన్నారు.

ఇక దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయమని నిర్మాతలు ధైర్యాన్ని ఇచ్చారని, ఖచ్చితంగా వాళ్ల నమ్మకాన్ని నిలబెడతానని, షూటింగ్ ముందు నుంచే 30 రోజులు హీరో, హీరోయిన్లకు రిహార్సల్ చేయించామన్నారు.

ఈ సినిమాలో వింజమూరి మధు ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తుండగా.. ఇంకా మిగిలిన పాత్రలలో తిరుపాల్, మల్లయ్య, రాబి, సలామ్ నటిస్తున్నారు. ఈ సినిమాకి షాయక్ పర్వేజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. మేనగ శ్రీ ఎడిటర్‌గా, వై.రవి ఫైట్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు.