భారతీయ సినిమాకి నడకలు నేర్పిన మహనుభావుల్లో ఆయన ఒకరు

భారతీయ సినిమాకి నడకలు నేర్పిన మహనుభావుల్లో ఆయన ఒకరు. తెలుగు సినిమాకు క్లాసిక్ అనదగ్గ సినిమాలు అందించిన దర్శకుడు ఆయన. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, సినిమాటోగ్రఫర్‌గా, నటుడుగా సినీ డిక్షనరిలో తనకంటూ కొన్ని పేజిలు సృష్టించుకున్న ఉద్దండుడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు ఎల్.వి.ప్రసాద్. భారతీయ సినీ రంగానికి ఎనలేని సేవలందించినందుకు గాను దాదాసాహేభ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు ఈయన..ఈ రోజు ఆయన జయంతి(జనవరి17). ఎల్.వి.ప్రసాద్ విషయానికొస్తే.. కష్టానికి నిర్వచనం ఆయన పేరు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్‌ను ఆకర్షించేవి …స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవారు.

సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ ఆసక్తిగా చూసేవాడు. వంద రూపాయాలతో ముంబాయి నగరంలో అనామకుడిగా అడుగు పెట్టిన ప్రసాద్ సినీ రంగంలో అనితర సాధ్యుడినిపించుకున్నాడు. ముంబై వీనస్ ఫిల్మ్ కంపెనీలో చిన్నచిన్న పనులు చేసే సహాయకుడుగా జీవితాన్ని ప్రారంభించిన ఎల్.వి. ప్రసాద్, శబ్ద చిత్రం “స్టార్ ఆఫ్ ది ఈస్ట్”లో చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత మొట్ట మొదటి హిందీ టాకీ చిత్రం ‘ఆలం అరా’తో పాటు తొలి తమిళ టాకీ ‘కాళిదాస్’ తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లద’ వంటి మూడు భాషల్లో తెరకెక్కిన తొలి టాకీ సినిమాల్లో నటించిన ఏకైక నటుడిగా ఎల్ .వి ప్రసాద్ చరిత్రకెక్కారు.

దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకున్న ఎల్.వి ప్రసాద్ 1908 జనవరి 17 లో జన్మించారు. ఈయన పూర్తి పేరు అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు ఆయన సొంతూరు. ఈయన తల్లిదండ్రులు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ. ఎల్.వి.ప్రసాద్ విషయానికొస్తే.. ఈయన హిందీ, తమిళ, తెలుగు కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకుడిగా,నిర్మాతగా,నటుడిగా పలు విధాలుగా తన పాత్రను పోషించారు.

దర్శకుడిగా ఎల్.వి.ప్రసాద్ మొదటి చిత్రం ‘గృహ ప్రవేశం’. 1943లో ‘గృహ ప్రవేశం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తోన్న ఎల్.వి ప్రసాద్..కొన్ని పరిస్థితులా కారణంగా అదే సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది. అలా అనుకోకుండా డైరెక్టర్ అయిపోయారు ఎల్.వి.ప్రసాద్. ఆ తర్వాత దర్శకుడిగా కాకుండా నటుడిగా హిందీలో వచ్చిన ‘సీతా స్వయంవర్’, తెలుగులో ‘బొండం పెళ్ళాం’, ‘చదువుకున్న భార్య’, అలాగే తమిళ్‌లో ‘రాజా పార్వయి’ లాంటి చిత్రాలలో మంచి పాత్రల్లో నటించారు.

అంతేకాదు దర్శకుడిగా 1949లో వచ్చిన ‘మన దేశం’ సినిమాతో ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసారు.\1\6ఎన్.టి.ఆర్‌తో పాటు షావుకారు జానకి, సావిత్రి లాంటి గొప్ప నటులను వెండి తెరకు పరిచయం చేసిన ఘనత ఎల్.వి ప్రసాద్ సొంతం. ఈయన తన దర్శకత్వంలో ఆణిముత్యాలు అనదగ్గ సినిమాలు అందించారు. ‘పల్నాటి యుద్దం’,‘ద్రోహి’,‘సంసారం’, ‘మిస్సమ్మ’, ‘అప్పు చేసి పప్పుకూడు’ లాంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇప్పటికే తెరకెక్కిన ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో ఎల్.వి.ప్రసాద్ ప్రస్థానవ ఉంది. మొత్తంగా సావిత్రి, ఎన్టీఆర్ జీవిత కథలను చెప్పాల్సి వస్తే.. అందులో ఎల్.వి.ప్రసాద్ పాత్ర లేకుండా చెప్పడం కష్టమే. అంతేకాదు ఎస్వీఆర్, ఏఎన్నార్, షావుకారు జానకి వంటి నటుల ఇంతలా రాణించారంటే దానికి కారణం ఎల్.వి.ప్రసాద్. అంతేకాదు కమల్ హాసన్ వంటి నటుడ్ని హిందీ తెరకు బాలచందర్ దర్శకత్వంలో ‘ఏక్ దూజే కే లియే’ సినిమాతో పరిచయం చేసిన ఘనత కూడా ఎల్.వి.ప్రసాద్‌కే దక్కుతుంది.

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, సినిమాటోగ్రాఫర్‌గా స్టూడియో అధినేతగా,థియేటర్స్ ఓనర్‌గా దక్షణాది సినీ రంగానికి దేశవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చారు ఎల్ వి ప్రసాద్. కింది స్థాయి నుండి ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిన ఈయన సామాజిక సేవతో కూడ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు స్టూడియోలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. హైదరబాద్‌లో చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడాని ఎంతో కృషి చేసారు. ఈయన చిత్ర రంగానికి చేసిన సేవలకు గాను కేంద్రం ఈయన్ని 1980లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. మరోవైపు తెలుగు చిత్ర రంగ ప్రవేశపెట్టిన రఘుపతివెంకయ్య తొలి అవార్డు మొదట అందుకున్నది ఈయనే. తెలుగుతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేసిన ఈయన జూన్ 22 1994లో స్వర్గస్తులయ్యారు. ఆయన కన్నుమూసిన తన చిత్రాలతో ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ కొలువై ఉన్నారు. ప్రసాద్ గారికి ఘన నివాళి