హైదరాబాద్ చేరిన రాకీ భాయ్…

గత ఏడాది డిసెంబర్ నెలలో డబ్బింగ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ కేజీఎఫ్. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. కన్నడ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కేజీఎఫ్ సినిమా, విడుదలైన అన్ని భాషల్లో మంచి కలెక్షన్స్ రాబట్టి కన్నడ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. కేజీఎఫ్ చాప్టర్ 1 సూపర్ హిట్ అవ్వడంతో చాప్టర్ 2పై అంచనాలు మరింత పెరిగాయి. వాటిని అందుకునే ప్రయత్నంలో దర్శక నిర్మాతలు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తో స్పెషల్ రోల్ లో కనిపించేలా చేస్తున్నారు. ఇక పార్ట్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకోని ప్రేక్షకుల ముందుకి రావడమే ఆలస్యం అనుకుంటున్న టైంలో కేజీఎఫ్ సినిమాకి అనుకోని అడ్డంకి వచ్చింది.

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని సైనైడ్ హిల్స్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న కేజీఎఫ్ చాప్టర్ 2 కారణంగా అక్కడి పర్యావరణానికి హాని కలుగుతుందని ఒకరు పిటీషన్ దాఖలు చేయడంతో, ఆ ప్రాంతంలో షూటింగ్ ఆపేయాలంటూ కోర్ట్ నోటీసులు ఇచ్చింది. దీంతో కేజీఎఫ్ షూటింగ్ కి టెంపరరీగా బ్రేక్ పడింది. ఐతే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి లొకేషన్ ని మార్చిన చిత్ర యూనిట్, కేజీఎఫ్ లేటెస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. నేటి నుంచి హైదరాబాద్ పరిసరాల్లో జరగనున్న షెడ్యూల్ లో హీరో యష్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.