టాలీవుడ్‌కు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్

టాలీవుడ్‌కి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. 2 వేల ఎకరాల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి సినిమా సిటీని నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు సినీ ప్రముఖులు తాజాగా ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, విస్తరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

1500 నుంచి 2 వేల ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం సేకరించి ఇస్తుందని, ఇందులో అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లు స్టూడియోలను నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎయిర్ స్ట్రిప్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.

సినీ ప్రముఖులు, అధికారుల బల్గేరియా వెళ్లి అక్కడ నిర్మించిన సినిమా సిటీని పరిశీలించి రావాలని కేసీఆర్ సూచించారు. సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. షూటింగ్‌లు తిరిగి ప్రారంభించాలని, థియేటర్లు కూడా ఓపెన్ చేయాలని కేసీఆర్ చెప్పారు.