Karnool: ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు కర్నూలులోని ఓర్వకల్లులో ఎయిర్పోర్టును ప్రారంభించారు. ఈ విమానాశ్రయానికి తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి అని పేరు పెట్టారు. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంతో తన హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయిందని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై పోరాట బావుటా ఎగురవేసిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడని చిరంజీవి అన్నారు.
ఉయ్యాల వాడ అత్యంత గొప్ప దేశభక్తుడని, అయితే చరిత్రలో మరుగునపడిపోయాడని వివరించారు. అలాంటి వీరుడి పేరు ఎయిర్పోర్టుకు పెట్టడం అత్యంత సముచిత నిర్ణయమని చిరంజీవి అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.