డిసెంబర్ 5 నుంచి కాజల్‌తో చిరు రోమాన్స్

ఇటీవలే ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఇటీవల మాల్దీవులకు వెళ్లి హనీమూన్‌ను కూడా ఎంజాయ్ చేసింది. భర్తతో కలిసి కాజల్ హానీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు హనీమూన్‌ను పూర్తిచేసుకుని ఈ బ్యూటీ ఇండియాకు తిరిగి వచ్చేసింది. త్వరలో తిరిగి సినిమా షూటింగ్‌లలో పాల్గొననుంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’ సినిమాలో కాజల్ నటిస్తోంది. డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా షూటింగ్‌లో కాజల్ పాల్గొననుందని సమాచారం. మొదటగా ‘ఆచార్య’లో త్రిషకు అవకాశం దక్కింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో కాజల్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’తో పాటు ‘ఇండియన్-2’లో కాజల్ నటిస్తోంది.

లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. చిరంజీవికి కరోనా అని తేలడంతో ఈ షూటింగ్‌లో పాల్గొనలేకపోయారు. అయితే ఆ తర్వాత నెగిటివ్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. త్వరలో ‘ఆచార్య’ షూటింగ్‌లో చిరు కూడా పాల్గొనే అవకాశముంది.