కరోనాతో జాగ్రత్త… అందరికీ ధన్యవాదాలు

యంగ్ హీరో ఎన్టీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. 15 రోజుల పాటు ఆయన హోంక్వారంటైన్ లో ఉండి వైద్యుల సూచనల మేరకు చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో కరోనా నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్టు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మంగళవారం ఉదయం తాను మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఈ పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కిమ్స్ వైద్యుడు ప్రవీణ్ కులకర్ణి, డాక్టర్ వీరు తదితరుల పర్యవేక్షణలో తాను చికిత్స తీసుకున్నానని, ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఎన్టీఆర్ స్పష్టం చేశారు. కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా, సీరియస్ గా తీసుకోవాలని ఆయన తేల్చిచెప్పారు. కరోనా బారినపడితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన తన అభిమానులకు సూచించారు.