వారందరూ టెస్టులు చేయించుకోవాల్సిందే.. హెచ్చరిస్తున్న వైద్యులు

ఇటీవల హీరో రాజశేఖర్.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్‌లో ప్రముఖ హీరోలకు కరోనా సోకడంతో టాలీవుడ్ సినీ వర్గాల్లో కలకలం రేగుతోంది. ఇటీవల సినీ ప్రముఖులతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చిరంజీవి కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరుకు కరోనా సోకడంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

chiranjevi

సీఎం కేసీఆర్‌తో సినీ పరిశ్రమ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో చిరుతో పాటు నాగార్జున, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. దీంతో వీరందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగడంతో అక్కడ పనిచేస్తున్న అధికారులందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ప్రముఖులను ఎక్కువమంది కలుస్తారు గనుక వారి చేయించుకోకపోతే మరింత మందికి సోకే అవకాశముంటుంది.

ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా సోకినప్పుడు కూడా ఆయనను కలిసినవారితో పాటు వైట్ హౌస్‌లో పనిచేసే అధికారులందరూ కరోనా టెస్టులు చేయించుకున్నారు. దానిని స్పూర్తిగా తీసుకుని ఇప్పుడు ప్రగతిభవన్‌లో పనిచేస్తున్న అధికారులతో పాటు సినీ పరిశ్రమ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.