మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, చెన్నైలోని ప్రసాద్ స్టూడియో మధ్య ఏర్పడిన వివాదం కోలీవుడ్లో కొద్దిరోజుల పాటు కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రసాద్ స్టూడియోలోని ఒక రూంని ఇళయరాజా అద్దెకు తీసుకుని ఎన్నో ఏళ్లుగా అక్కడినుంచే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆ రూంలోనే పాటలు కంపోజ్ చేశారు. అలాగే మార్నింగ్ ఇళయరాజా ఆ రూంలోనే ధ్యానం చేసేవారు. అంతగా ఆయనకు ఆ రూంతో అనుబంధం ఉంది.
కానీ ప్రసాద్ స్టూడియో యాజమాన్యం ఆ రూంను ఖాళీ చేయించడంతో.. దీనిపై ఇళయరాజా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఇళయరాజాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. రూం ఖాళీ చేయాలని ఆదేశించిన హైకోర్టు.. రూంలోని సంగీత పరికరాలను తీసుకునేందుకు అనుమతించింది. అయితే తన సంగీత పరికరాలను స్టోర్ రూంలో వేశారని, తనకు ఇచ్చిర రూంను కూల్చివేశారంటూ ఇళయరాజా ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మవిభూషణ్ అవార్డును వెనక్కి ఇవ్వాలని ఇళయరాజా నిర్ణయించుకున్నట్లు తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై తాజాగా ఇళయరాజా క్లారిటీ ఇచ్చారు. తాను పద్మవిభూషణ్ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.