మళ్లీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలు?

ఉత్కంఠభరితంగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఈ ఎన్నికలు జరిగాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ అగ్రశేణులందరూ హైదరాబాద్‌లో దిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిని బట్టి చూస్తే ఈ ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో అర్ధమవుతోంది. ఎన్నికల ప్రచారంలో పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఎన్టీఆర్, పీవీ నరసింహరావు సమాధులను కూలగొడతామని ఎంఐఎం నేతలు కామెంట్ చేయడం, దానికి కౌంటర్‌గా దారుస్సలాంను కూల్చేస్తామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇక రోహింగ్యాల గురించి బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యుల సంచలనం రేపాయి.

ghmc

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 99 సీట్ల భారీ మెజార్టీతో గెలవగా.. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని టీఆర్‌ఎస్ నేతలు బల్ల గుద్ది చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయి కారు బోల్తా పడింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వరద ప్రభావానికి హైదరాబాద్ రోడ్లు సముద్రాన్ని తలపించడం, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందింది. బీజేపీకి వచ్చిన సీట్లు చూసి టీఆర్‌ఎస్ నేతలే అవాక్కయ్యారు. ఎవరూ ఊహించని స్థాయిలో బీజేపీ పుంజుకుని టీఆర్‌ఎస్ షాకిచ్చిందనే చెప్పాలి.

బీజేపీ, టీఆర్‌ఎస్‌కు మధ్య సీట్ల తేడా చాలా తక్కువ మాత్రమే ఉండగా.. ఓట్ల శాతంకు వస్తే బీజేపీ, టీఆర్‌ఎస్ దాదాపు సమానంగా ఉన్నాయి. మాములుగా అధికారంలో ఉన్న పార్టీలకు ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తే.. ఒకరకంగా టీఆర్‌ఎస్ ఓడిపోయిందనే చెప్పుకోవాలి. 150 స్థానాలకు టీఆర్‌ఎస్‌కు 55 సీట్లు రాగా.. బీజేపీకి 48 సీట్లు వచ్చాయి. ఇక హైదరాబాద్‌లో ఎప్పటినుంచో బలమైన పార్టీగా ఉన్న ఎంఐఎంకు 44 సీట్లు వచ్చాయి. ఇతరులు 2 సీట్లను గెలుచుకున్నారు. అంటే టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సీట్ల తేడా 7 మాత్రమే.

గ్రేటర్ ప్రజలు ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు ఇవ్వకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఏ పార్టీ నుంచి అవుతారనేది గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు పూర్తై దాదాపు నెల కావొస్తున్నా… ఇంకా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగలేదు. ఈ క్రమంలో ఒక వార్త సంచలనంగా మారింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవి నుంచి టీఆర్‌ఎస్ తప్పుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. టీఆర్‌ఎస్ తప్పుకుంటే బీజేపీ, ఎంఐంలకు కూడా మ్యాజిక్ ఫిగర్ సీట్లు లేవు. బద్దశత్రువులైన బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసే అవకాశాలు అసలు లేవు. ఇక టీఆర్‌ఎస్, ఎంఐఎంలు మిత్ర పార్టీలైనా.. ఆ రెండు పార్టీ పార్టీలు కలిసి మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఏ పార్టీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి జీహెచ్‌ఎంసీ బాధ్యతలు వెళతాయని ప్రభుత్వ వర్గాల భోగట్టా. ఇదే జరిగితే మళ్లీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. 2022లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే జరిగితే రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముందని సమాచారం.

అప్పటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్ స్థానాలు కూడా మారనున్నాయి. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించారు. కానీ రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనరల్ కోటా స్థానాలు రిజర్వుడుగా, మహిళల రిజర్వు స్థానాలు పురుషు అభ్యర్థులకు వెళ్లే అవకాశముంది. ఒక సామాజిక వర్గం రిజర్వుడు స్థానాలు వేరే సామాజికవర్గానికి వెళ్లే అవకాశముంది. ఏది ఏమైనా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే