విశ్వక్ సేన్, చాందినీ చౌదని హీరో హీరోయిన్లుగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘గామి’. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8లో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ స్నో కింగ్డమ్లో మీడియాతో ముచ్చటించింది.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో ఇలా స్నో కింగ్డమ్లో నిర్వహించాలనే ఐడియా అంతా కూడా జీ5 టీందే. గామిలాంటి సినిమాలకు మామూలుగా అవార్డులు, ప్రశంసలు వస్తుంటాయి. కలెక్షన్లు రావని అంతా అనుకుంటారు. కానీ ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్లను సాధించింది. వారణాసిలోని ఘాట్‌లో శవాలు కాలుతున్నా కూడా ఓ 20 నిమిషాలు షూట్ చేశాం. చావుని వాళ్లు సెలెబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు నాకు జీవితం చాలా చిన్నది అనిపించింది. ఇలాంటి కథను నమ్మాలి. ఓ ఫ్లాప్ సినిమాను తీయడం కంటే.. ఇలాంటి కథను నమ్మడం బెటర్. గామిని థియేటర్లో అందరూ చూశారు. ఏప్రిల్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోనూ మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.
డైరెక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ.. ‘థియేటర్లో మా సినిమా కొంత మందికి అర్థం కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. మూడు నాలుగు సార్లు చూస్తే మా థీమ్ ఏంటి? మా కాన్సెప్ట్ ఏంటి? అన్నది అందరికీ ఈజీగా అర్థం అవుతుంది. మేం ఎప్పుడూ ఈ సినిమా కోసం లెక్కలు వేసుకోలేదు. చిన్నా, పెద్దా.. బడ్జెట్ అంటూ ఇలా లెక్కలేసుకుండా సినిమా తీశాం. జీ5లో ఏప్రిల్ 12 నుంచి మా స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ వీక్షించండి’ అని అన్నారు.
లాయిడ్ జేవియర్ (జీ 5 సౌత్, వైస్ ప్రెసడెంట్ – మార్కెటింగ్) మాట్లాడుతూ.. ‘గామిలాంటి మంచి చిత్రాన్ని తీసిన విద్యాధర్, విశ్వక్ సేన్‌లకు థాంక్స్. ఈ రోజు ఇలా వినూత్నంగా ఆలోచించి ఈవెంట్‌ను నిర్వహించాం. స్నో కింగ్డమ్లో ప్రెస్ మీట్ నిర్వహించటం ఇండియాలోనే ఇదే తొలిసారి. అందరూ ఎంజాయ్ చేసుంటారని భావిస్తున్నాం. చాలా కొత్తగా ఉంటుందని ఇలా స్నో కింగ్డమ్లో ఈవెంట్ పెట్టాం. ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ్, కన్నడలో జీ5లో గామి స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ వీక్షించండి. 2024లో వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఇదొకటి’ అని అన్నారు.