రామ్ చరణ్ ని అభినందించిన పవన్ కళ్యాణ్

వివిధ రంగాల్లో విశిష్ట వ్య‌క్తుల‌ను గుర్తించి వారికి గౌర‌వ డాక్ట‌రేట్స్ ఇవ్వ‌టంలో వేల్స్ యూనివ‌ర్సిటీ ప్ర‌సిద్ధి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎంట‌ర్‌ప్రెన్యూర‌ర్‌గా రామ్ చరణ్ చేసిన సేవ‌ల‌కు వేల్స్ యూనిర్సిటీ ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌ను అంద‌చేస్తోంది. ఈ వేడుక ఏప్రిల్ 13న గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ ను అభినందిస్తూ జనసేన పార్టీ ధ్వారా ప్రెస్ నోట్ విడుదల చేసారు.


ఆ ప్రెస్ నోట్ ద్వారా “చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సాధించిన శ్రీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. శ్రీ రామ్ చరణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. తమిళనాడులోని వెల్స్ విశ్వ విద్యాలయం వారు రామ్ చరణ్ కు ఉన్న ప్రేక్షకాదరణ, చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించడం ఎంతో ముదావహం. గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని… మరెన్నో పురస్కారాలు… మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.