దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ టీజర్ విడుదల

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని వ్యక్తిగా మారాడు. ఇప్పుడు ఆయన ‘లక్కీ భాస్కర్’ అనే బహుభాషా చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి కళా దర్శకుడిగా బంగ్లాన్, ఎడిటర్ గా నవీన్ నూలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అయితే ఏప్రిల్ 11న రంజాన్ ను పురస్కరించుకుని తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ‘సార్/వాతి’ వంటి ఘన విజయం తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ రూపొందిస్తున్న సినిమా కావడం విశేషం. ‘లక్కీ భాస్కర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.