ప్రపంచంలో ఎవరూ చేయనిది విక్రమ్ చేసి చూపిస్తున్నాడు

సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో చియాన్ విక్రమ్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. అపరిచితుడు, శేషు, శివపుత్రుడు, ఐ ఇలా చెప్పుకుంటూ విక్రమ్ నటన గురించి ఎన్నో విషయాలు బయటకి వస్తాయి. ఒక సినిమా కోసం ఒళ్లు హూనం చేసుకోవడానికి కూడా వెనకాడని ఈ హీరో బెస్ట్ ఫిలిం అనగానే అపరిచితుడు గుర్తొస్తుంది. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో విక్రమ్ రామూ..రెమో.. అపరిచితుడుగా అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక ఐ సినిమాలో తనలోని నటుడిని పీక్ స్టేజ్ లో చూపించిన విక్రమ్, ఇప్పుడు ఒకే సినిమాలో 25 గెటప్స్ వేయడానికి రెడీ అయ్యాడు.

1964లో వచ్చిన నవరాత్రి సినిమాలో అప్పటి కోలీవుడ్ స్టార్ శివాజీ గణేశన్ 9 పాత్రల్లో కనిపించాడు. ఇది జరిగిన 44 ఏళ్లకి 2008లో వచ్చిన దశావతారం సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ పది రకాల పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ‘వాటీజ్ యువర్ రాశీ’ అనే సినిమాలో 12 గెటప్పులు వేసింది. మంచి హిట్ గా నిలిచిన ఈ మూవీ తర్వాత ఏ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మళ్లీ ఇలాంటి ప్రయోగం జరగలేదు. ఇప్పుడు విక్రమ్ ఈ సాహసానికి దిగి, తన నెక్స్ట్ సినిమాకి 25 గెటప్స్ వేస్తున్నాడు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 గెటప్స్ తో అలరించబోతున్నాడు చియాన్ విక్రమ్. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. స్క్రీన్ స్టూడియోస్- వియాకామ్ 18స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 4న సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని 2020 సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.