సినిమా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు ఫిల్మ్ యూనిట్లను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. ఈ మేరకు నాలుగు ఫిల్మ్ యూనిట్లను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(NFDC)లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఫిల్మ్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీలు విడివిడిగా ఉండేవి. ఇప్పుడు ఈ నాలుగు యూనిట్లను NFDCలో కేంద్రం విలీనం చేసింది. సినిమా రంగానికి మరింత మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
సినిమా నిర్మాణాలు చేపట్టేవారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఫిల్మ్ డివిజన్ విషయానికొస్తే.. 1948లో దీనిని స్థాపించారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం న్యూస్ మ్యాగ్జిన్స్ రూపొందించడం, భారతీయ సినిమా చరిత్రకు సంబంధించిన డాక్యుమెంటరీలను రికార్డు చేయడం దీని బాధ్యత. సమాచార, ప్రసారశాఖ సబార్డినేట్ కార్యాలయంగా ఉండేది. ఇక చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీని 1955లో సొసైటీస్ యాక్ట్ కింద స్థాపించారు. పిల్లలు, యువతకు సినిమాల ద్వారా వినోదాత్మక విలువలు అందించేందుకు దీనిని నెలకొల్పారు.
ఇక నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా విషయానికొస్తే.. భారతీయ సినిమా వారసత్వాన్ని పరిరక్షించేందుకు దీనిని 1964లో మీడియా యూనిట్‌గా స్థాపించారు. ఇక భారతీయ సినిమాలు, సంస్కృతిని ప్రమోట్ చేసేందుకు 1973లో డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ నాలుగు మీడియా యూనిట్లను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.