సినిమాల్లో క్రియేటివిటీ శృతిమించినా, ఎవరి మనోభావాలు దెబ్బ తీసేలా సన్నివేశాలు డైలాగులు ఉన్నా కత్తెర పట్టుకోని సెన్సార్ బోర్డు సిద్ధంగా ఉంటుంది. మితిమీరిన శృంగారం, విపరీతమైన బూతు వినిపిస్తే చాలు అక్కడ కత్తెర పడాల్సిందే. ఈ గోల అంతా ఎందుకు అనుకున్న వాళ్లు, తమలోని క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్న వాళ్లు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై పడ్డారు. సెన్సార్ ఇబ్బందులు ఉండవు, పర్మిషన్స్ తో పని లేదు… అనుకున్నది షూట్ చేసి, అస్తవ్యస్త డైలాగులు పెట్టి ప్రతి ఒక్కరూ క్రియేటివిటీ పేరుతో రెచ్చిపోతున్నారు. ఇక పై అలా జరిగే వీలు లేదు, డిజిటల్ కంటెంట్ ని ఇష్టానుసారం చూపిస్తామంటే కుదరదు. త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ సెన్సార్ షిప్ కి రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి కూడా సెన్సార్ ఉండాలని నిర్ణయించిన డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఈ విషయంపై సీరియస్ గా వర్క్ చేస్తున్నారట.
యూట్యూబ్ – వెబ్ టీవీ- స్మార్ట్ టీవీ- ఆండ్రాయిడ్- గూగుల్ టీవీ- యాపిల్ టీవీ- గేమింగ్ కన్సోల్స్- మొబైల్ టీవీ.. ఇలా ఇంటర్నెట్ ఆధారిత సర్వీసులన్నీ ఓవర్ ది టాప్ ప్లాట్ ఫామ్స్ పరిధిలోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, కొంతమంది ఓటీటీ ప్రముఖులకి డిజిటల్ కంటెంట్ సన్సార్ పై అవసరమైన రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ తయారు చేయాల్సిందిగా కోరిందట. ఇంత సడెన్ గా డిజిటల్ కంటెంట్ పై సెన్సార్ ఉండాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆరా తీస్తే, ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఒక షో కారణంగా మత వివాదాలు తలెత్తాయి. ఆ క్రమంలోనే ప్రభుత్వం, డిజిటల్ కంటెంట్ సెన్సార్షిప్ పై సీరియస్ గా ఆలోచిస్తోంది. నెట్ ఫ్లిక్స్ తో మొదలుపెడితే అమెజాన్ వరకూ వెబ్ సిరీస్ లను తెరకెక్కించే ప్రతి సంస్థ, తమ కంటెంట్ ని సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాతే ఎయిర్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పై పెరుగుతున్న బూతు కంటెంట్ కి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.