టీ తాగడానికి జేబులో చిల్లర కూడా ఉండేవి కాదు. పది రూపాయల జీతానికి పనిచేశాడు. సైకిల్ కి పాలడబ్బాలు కట్టుకుని షాపులకి పంపిణీ చేసేవాడు. 150 రూపాయల జీతానికి అసిస్టెంట్ గా చేశాడు. సేల్స్ రిప్రెజెంటేటివ్ గా 200 జీతానికి పనిచేశాడు. పెట్రోల్ బంకులో పనిచేశాడు. ఒక చోట ఉద్యోగానికెళ్తే 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళకే ఉద్యోగం అన్నారు. నెలకు 300 కోసం బికాం పాసయినా పదవ తరగతి ఫెయిల్ అయ్యానని చెప్పి ఆ ఉద్యోగంలో చేరాడు. పదేళ్ళ పాటు ఎన్నో పనులు చేశాడు.
అంతర్గతంగా తనలో నటుడూ, రచయిత ఉన్నారు. అది గుర్తించాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూనే కొన్ని వందల నాటకాలు ప్రదర్శించాడు. అలా కొంతకాలానికి సినిమాలలోకి ప్రవేశించాడు. అక్కడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
అతనే … “ ఇంకుపెన్నుతో ముత్యాల్లాంటి అక్షరాలతో సంభాషణలు రాసి ఆ రాసిన పేజీలు చూసుకుంటూ మురిసిపోయేవాడిని. ఇండస్ట్రీలో కొందరు అనే మాటలు, వేధింపులకు భోరున ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. నా కన్నీటికి ఇంకుపెన్నుతో రాసుకున్న అక్షరాలు చెరిగిపోయేవి. దాంతో నాకిష్టమైన ఇంకుపెన్నుతో కాకుండా బాల్ పెన్ తో రాయడం మొదలుపెట్టాను” అంటాడు.
జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఎదుర్కొని అన్నిటినీ పాజిటివ్ గానే తీసుకుంటూ .. ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన ఆ వ్యక్తి – “తనికెళ్ళ భరణి” గారు.