ఆ హీరో కెరీర్ కి పవన్ కళ్యాణ్ కథ హెల్ప్ అవుతుందా?

రాక్షసుడు సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఈసారి సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ ఒకప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ తో అజిత్ నటించిన వేదాళం సినిమాని రీమేక్ చేయాలని ప్లాన్ చేశాడు. అది వర్కౌట్ కాకపోతే అదే కథని రవితేజతో చేయడానికి కూడా ప్రణాళిక వేశాడు, తీరా అది కూడా సెట్ కాకపోవడంతో సంతోష్ శ్రీనివాస్ సైలెంట్ అయిపోయాడు.

ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ అదే కథని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి వినిపించాడట. తమిళ సినిమాకి తెలుగుకి తగ్గట్లు మార్పులు చేసిన సంతోష్ శ్రీనివాస్, ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడని సమాచారం. అయితే పవన్ కి సాయి శ్రీనివాస్ కి ఇమేజ్ విషయంలో ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉంది. అలాంటిది పవన్ కోసం రాసిన కథని సాయి శ్రీనివాస్ తో చేయాలని సంతోష్ శ్రీనివాస్ ఎలా ప్లాన్ చేశాడో తెలియదు కానీ ఈ మూవీ హిట్ అయితే మాత్రం బెల్లంకొండ హీరో కెరీర్ హ్యుజ్ టర్న్ తీసుకున్నట్లే.