మే 28న ‘BB3’

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అయిన నందమూరి నటసింహం బాలకృష్ణ-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రానున్న BB3పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్ధలు కొట్టాయి. దీంతో ఈ కాంబినేషన్‌లో వస్తున్న BB3పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

విశ్వవిఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న నందమూరి తారక రామారావు జ‌యంతి సందర్భంగా.. మే 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కొత్త పోస్టర్‌లో స్టైలిష్‌ లుక్‌లో జేబులో చేయిపెట్టుకుని న‌డిచివ‌స్తున్న బాల‌య్య లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘BB3 ఫస్ట్ రోర్’ టీజ‌ర్‌కి అద్భుతమైన స్పందన వ‌చ్చింది.