పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన బండ్ల గణేష్.. సినిమా ఫిక్స్

చాలా రోజుల తరువాత నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒక బిగ్ సర్ ప్రైజ్ తో పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తన కలల ప్రాజెక్ట్ మరొకటి సెట్స్ పైకి రానుందని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ ని కలిసిన బండ్ల గణేష్ తన ప్రొడక్షన్ లో మరో సినిమా చేసేందుకు ఒప్పించాడు. తీన్ మార్ సినిమా తరువాత పవర్ స్టార్ తో గణేష్ నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఫైనల్ గా వీరి కాంబినేషన్ లో మరో సినిమా సెట్టయ్యింది. మొత్తానికి మా బాస్ మరోసారి ఓకే చెప్పాడు. అలాగే నా కల మరోసారి నిజం కాబోతోంది. నా దేవుడు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయాన్ని ఇంకా చెప్పలేదు. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి వారితో సినిమాలను చేయనున్న విషయం తెలిసిందే. మరి బండ్లగణేష్ నిర్మించబోయే పవన్ కళ్యాణ్ 30వ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.