బన్నీ కోసం కిలోమీటర్ల పాదయాత్ర

హీరోపైన అభిమానం ఉంటే రిలీజ్ టైములో బ్యానర్ లు కడతారు, పాలాభిషేకాలు చేస్తారు ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఈ కాలంలో అయితే హీరో కోసం ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు. ఏ అభిమాని అయినా తన హీరో కోసమో హీరోయిన్ కోసమో ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తాడు కానీ అల్లు అర్జున్ అభిమాని మాత్రం తన హీరోని కలవడానికి ఏకంగా పాదయాత్రనే చేశాడు. అవును మీరు చదివింది నిజమే, నాగేశ్వరరావు అనే అబ్బాయి అల్లు అర్జున్ ని కలవడానికి గుంటూరు జిల్లా మాచర్ల నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర మొదలుపెట్టాడు. బన్నీకి వీరాభిమాని అయిన నాగేశ్వరరావు, ఫేవరేట్ హీరోతో కలిసి ఫోటో దిగి, తిరిగి మాచర్లకు వెళ్లాలనే ధృడ సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నాడు.

ఈ నెల 17న మాచర్ల నుంచి నాగేశ్వరరావు హైదరాబాద్‌కు బయలుదేరాడు. తన అభిమాన హీరోను కలవటానికే పాదయాత్ర చేస్తున్నానని తెలిపాడు. ”బన్నీ తొలి సినిమా గంగోత్రి నుంచే అల్లు అర్జున్‌పై అభిమానం పెరిగిందని, ఈ నెల 17వ తేదీన ఉదయం 8 గంటలకు పాదయాత్ర చేపట్టానని.. మంగళవారం సాయంత్రానికి అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటా… అన్న బిజీగా ఉండొచ్చు కానీ ఖాళీగా ఉన్న సమయంలో పిలిపిస్తాడేమోనని చిన్న ఆశ ఉంది. గంగోత్రి సమయం నుంచి అన్నని చూడాలని ఆశ. గతంలో రెండు సార్లు అన్న పుట్టిన రోజున గీతా ఆర్ట్స్ దగ్గరకు వచ్చా. ఆ రోజు బాగా వర్షం పడింది కానీ మొదటిసారి దగ్గర నుంచి అన్నను చూశా. అప్పుడే అనుకున్నా అన్నను కచ్చితంగా కలవాలని, ఇప్పటివరకూ నాలుగైదు సార్లు కలవాలని ట్రై చేశా కానీ కలవలేకపోయా. ఈసారి ఎలా అయినా కలవాలని పాదయాత్ర చేపట్టా. ఇది చూసైనా అన్న నా భుజంపై చెయ్యి వేసి ఫోటో దిగుతాడేమో అనే ఆశ” అని నాగేశ్వరరావు తెలిపాడు. ఫ్లెక్సీ పట్టుకుని రోడ్డుపై నడుస్తూ నాగేశ్వరరావు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. మరి నాగేశ్వరరావు విషయం బన్నీ దృష్టికి వెళుతుందో లేదో చూడాలి. ఈ సారైనా అతని ఆశ ఫలిస్తుందో.. లేదంటే నిరాశగా వెనుదిరుగుతాడో వేచి చూడాలి.