ఏడాదికి మూడు సినిమాలు బాలీవూడ్ స్టార్ హీరో, తన ఇన్నేళ్ల కెరీర్ లో మొదటిసారి పీరియాడికల్ సినిమాలో నటించబోతున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందనున్న పృథ్వి రాజ్ సినిమాలో అక్షయ్ లీడ్ రోల్ ప్లే చేయనున్నాడు. అజమీర్ ని రాజధానిగా చేసుకోని పాతికేళ్లకే రాజస్థాన్ నుంచి హర్యానా వరకూ పాలించిన వీరుడు పృథ్విరాజ్ చౌహన్. ఇంతటి వీరుడి కథలో హీరోగా నటించనున్న అక్షయ్ కుమార్, “నా జీవితంలో తొలిసారి హిస్టారికల్ చిత్రంలో నటించబోతున్నాను. గొప్ప ధైర్యసాహసాలున్న, విలువలున్న పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. నా అదృష్టంగా భావిస్తున్నాను. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై డా.చంద్రశేఖర్ ద్వివేది దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాను. వచ్చే ఏడాది దీపావళికి సినిమా విడుదలవుతుంది“ తన ఫీలింగ్ ని షేర్ చేసుకున్నారు.
బయోపిక్, వార్ బేస్డ్ ఫిల్మ్స్ హవా నడుస్తున్న బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ మొదటిసారి పీరియాడికల్ ఫిల్మ్ లో నటించనుండడంతో పృథ్విరాజ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే భారీ వార్ బేస్డ్ సినిమాలకి కెరాఫ్ అడ్రెస్ గా నిలిచిన దర్శక ధీరుడు రాజమౌళి, పృథ్విరాజ్ చౌహన్ కథతో సినిమా చేయాలనుకుంటున్నట్లు, బాహుబలి కన్నా ముందే ఈ రాజుపై సినిమా చేయాలనుకున్నని చాలా సార్లు చెప్పాడు. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ ఈ మూవీని అనౌన్స్ చేయడంతో రాజమౌళి ఇకపై ఈ సినిమా చేసే అవకాశం లేదు. మరి మహాభారతాన్ని అయినా రాజమౌళి చేస్తాడా లేక బాలీవుడ్ వర్గాలు దాన్ని కూడా హిందీలో చేస్తాయా అనేది చూడాలి. అయితే పృథ్వి రాజ్ చౌహన్ కథ వేరే, ఒకసారి ఒకరు తెరకెక్కించిన తర్వాత మరొకరు అదే కథతో సినిమా చేసే అవకాశం లేదు కానీ మహాభారతం అలా కాదు. అదో కథల భాండాగారం, ఎవరు ఎన్ని సినిమాలు చేసినా మరో కోణంలో కొత్త కథ పుడుతుంది. సో రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ కి వచ్చిన ఢోకా ఏమీ లేదు.