తమిళ మూవీ ‘అసురన్’కి రీమేక్ గా తెలుగులో వస్తున్న సినిమా నారప్ప. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న నారప్పని థియేటర్స్ లో కాకుండా 20వ తారీకున అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. అసురన్ మూవీనే అలానే చూపించాలి అనుకున్నారో లేక మనం ఎందుకు రిస్క్ చేయాలి అనుకున్నారో తెలియదు కానీ నారప్ప మేకర్స్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అచ్చుగుద్దినట్లు దించేసారు. ఇక్కడ డైరెక్టర్ క్రియేటివిటీ కానీ మ్యూజిక్ డైరెక్టర్ క్రియేటివిటీ కానీ అసలు కనిపించదు, కళ్ళు మూసుకోని ట్రైలర్ వింటే అసురన్ తెలుగు డబ్బింగ్ లాగా అనిపిస్తుంది కానీ రీమేక్ లా అనిపించదు. వెంకటేష్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఆఖరికి అతను కట్టిన తల పాగా కూడా ఒరిజినల్ నుంచి యదాతధంగా దించేసిందే. చాలా హిట్ సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతూ ఉంటాయి కానీ మన పరిస్థితులకి తగ్గట్లు, మన నేటివిటీకి తగ్గట్లు మార్చి రీమేక్ చేస్తారు. నారప్ప విషయంలో అలాంటి ప్రయోగాల వైపు వెళ్లినట్లు లేరు. కాస్టింగ్ మినహా కలర్ టింట్, యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్ తో సహా అసురన్ సినిమా నుంచి కాపీ పేస్ట్ చేసినవే.
ట్రైలర్ లో వెంకటేష్ చెప్పిన ‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ ఈ డైలాగ్ నారప్ప సినిమాకే కాదు సమాజ మనుగడకి కూడా అవసరం. అసలు అసురన్ తో పోల్చకుండా ఒక కొత్త కథగా చూస్తే మాత్రం అసురన్ డెఫినెట్ గా తెలుగు ఆడియన్స్ ని మెప్పించే సినిమానే అయితే ఒటిటిల పుణ్యమాని అసురన్ మూవీని చాలా మందే చూశారు. సో నారప్పని అసురన్ తో తప్పకుండా పోల్చి చూస్తారు. మొత్తానికి అసురన్ తో కంపేర్ చేస్తే గత కొంత కాలంగా కంప్లీట్ యాక్షన్ లో కనిపించని వెంకటేష్ సీరియస్ గా ఫైట్ చేయడం ఒక్కటే నారప్పలో కొత్త విషయం. ధనుష్ బాగా నటించాడా లేక వెంకటేష్ బాగా నటించాడా అనే డిబేట్ పోస్ట్ నారప్ప రిలీజ్ మాట్లాడుకుందాం. అప్పటివరకూ ఒక ఫ్యామిలీ డైరెక్టర్ తీసిన ఒక మెసేజ్ ఓరియెంటెడ్ పక్కా మాస్ మూవీ ట్రైలర్ ని చూసి ఎంజాయ్ చేయండి.