బిగ్ బాస్ 5 హోస్ట్ గురించి సోషల్ మీడియా లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. నాగార్జున బిగ్ బాస్ 5 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. తొలి సీజన్ ఎన్టీఆర్.. రెండో సీజన్ నాని.. మూడు నాలుగు సీజన్స్ నాగార్జున చేసారు. పోనీలే రెండు సీజన్స్ మార్చకుండా నాగార్జుననే కంటిన్యూ చేసారు కదా.. ఇకపై ఆయన్నే చూడొచ్చు అని అభిమానులు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ కొత్త ప్రచారం మొదలైంది.
సీజన్ 5 నుంచి నాగార్జున తప్పుకుంటున్నాడని.. ఆయన స్థానంలో దగ్గుబాటి హీరో రానా వచ్చి చేరబోతున్నాడని తెలుస్తుంది. దీనికి ప్రత్యేకంగా కూడా కారణాలేం లేవు. నాగార్జున ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా చేయాల్సిన సినిమాలు.. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ అలాగే పెండింగ్‌లో పడిపోయాయి. ఈ సమయంలో బిగ్ బాస్ 5 కోసం డేట్స్ కేటాయించడం కష్టంగా మారిపోయింది. అందుకే ఈ ఒక్క సీజన్‌కు ఈయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని నిర్వాహకులకు చెప్పి తప్పుకున్నట్లు తెలుస్తుంది.
ఉన్నట్లుండి నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా షాకయ్యారు. ఈ స్థానంలో రానా దగ్గుబాటిని తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. బుల్లితెరపై రానాకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నెం 1 యారీతో ఇప్పటికే రికార్డులు సృష్టించాడు రానా. పైగా రానా పేరును నాగార్జున సూచించినట్లు తెలుస్తుంది.
మరి నిజంగానే నాగార్జున బిగ్ బాస్ 5 నుంచి తప్పుకున్నాడా లేదంటే ఇది కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ఉత్తుత్తి ప్రచారమేనా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 5 తెలుగు సెప్టెంబర్ 5 నుంచి మొదలు కానుందని గట్టి ప్రచారమే జరుగుతుంది.