ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు చాలానే ఉన్నాయి. ప్రతి రోజు 18 నుంచి 25వేల కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రంలో ఈరోజు 18వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్‌ను పరీక్షించగా, 18,285 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం మీద రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కారణంగా 99మంది చనిపోయారు. వీరిలో అత్యధికంగా చిత్తూరు జిల్లా(15) నుంచే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో బాధపడుతూ ఇప్పటివరకూ 10,427మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే కరోనా ఉద్ధృతి నానాటికీ పెరుగుతూ ఉండడం, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉండడంతో ఎన్టీఆర్ ట్రస్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలిలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. హెరిటేజ్ సీఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ఎన్టీఆర్ ట్రస్టు వర్గాలు తెలిపాయి. బ్రతికున్నంత కాలం ఆ పెద్దాయన ప్రజల కోసమే బ్రతికాడు, ప్రజల మంచి కోసమే కష్టపడ్డాడు. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ని ఆయనకి గుర్తుగా, ఆయన ఆశయాల సాధన కోసం 1997లో చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. అప్పటి నుంచి గడిచిన 24 ఏళ్లలో ఈ ట్రస్ట్ తరపున ఎన్నో మంచి పనులు చేశారు ఎందరికో ఉపాధి కలిపించారు. సేవ చేయడానికి ముందుండే ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు ప్రజల కోసం ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడం గొప్ప విషయం. మే 28న అన్నగారి పుట్టిన రోజుకి సరిగ్గా 48 గంటల ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం హర్షించాల్సిన విషయం.