తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవలే ఆనారోగ్య బారిన పడి ఇక రాజకీయాలకు రానని.. తన నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రజనీ అభిమానులు, సంఘాలు ఎంతో నిరుత్సాహంతో కొత్త దారులను వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీ అభిమాన సంఘం నుంచి ముగ్గురు జిల్లా సెక్రటరీలు తాజాగా డీఎంకేలో చేరారు. దీంతో ఇలాంటి పరిస్థితులను గమనించిన రజనీ అభిమాన సంఘం కీలక ప్రకటన చేసింది.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తేలిపోవడంతో.. రజనీ అభిమాన సంఘం నుంచి ఎవరైనా ఇతర పార్టీలో చేరాలనుకుంటే.. వారు తప్పకుండా అభిమాన సంఘానికి రాజీనామా చేసి చేరవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రజనీ అభిమాన సంఘం మేనేజర్ వీఎం సుధాకర్ మాట్లాడుతూ.. అభిమానులు ఎవరైనా ఇతర పార్టీల్లో చేరండి.. కానీ తమ అభిమాన నటుడికి అభిమానులున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఇదిలాఉంటే.. గతేడాది డిసెంబర్ 29న ఆరోగ్య సమస్యలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని రజనీకాంత్ ప్రకటించగా.. దీంతో ఆయన ఇంటి ముందు రజనీ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో ఇలా ఆందోళనలు చేయడం వల్ల తన నిర్ణయాన్ని మార్చలేనని, చాలా బాధ కలిగించిదని రజనీకాంత్ ప్రకటన చేశారు.