ఏఆర్ రెహమాన్. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తెలియనివారంటూ ఎవరూ ఉండరు. మ్యూజిక్ ప్రియులకు ఆయన సంగీతమంటే ఒక పిచ్చి. తన మ్యూజిక్‌తో భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి ఆయన. తన సంగీతంతో ఎంతోమందిని అలరించి ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న భారతీయుడిగా ఆయన పేరు ఇప్పటికీ, ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన భారతీయుడు అయినందుకు మనందరం చాలా గర్వపడాలి. ఇవాళ ఏఆర్ రెహమాన్ తన పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు.
1967లో జనవరి 6న మద్రాసులో రెహమాన్ జన్మించాడు. దీంతో నేటితో 54 ఏళ్లు పూర్తి చేసుకుని 56వ ఏటలోకి రెహమాన్ అడుగుపెట్టబోతున్నాడు. రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. 1989లో ఆయన తన కుటుంబంతో కలిసి ఇస్లాం మతంలోకి మారాడు. దాంతో అల్లా రఖా రెహమాన్‌గా పేరు మారింది. రెహమాన్ తండ్రి శేఖర్ ఆలయాల్లో భజన పాటలు పాడేవారు. అలా రెహమాన్‌కు పుట్టుకతోనే సంగీతంతో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్ల వయస్సులోనే రెహమాన్ తన తండ్రి దగ్గర పియానో నేర్చుకున్నాడు.
కానీ రెహమాన్ 9 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తండ్రి హఠాన్మరణం చెందారు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు గిటార్, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా మారాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన రోజా సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాతో రెహమాన్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రెహమాన్‌కి వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. రెహమాన్‌తో మ్యూజిక్ చేయించుకునేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కట్టేవారు. ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకు అన్ని రకాల మ్యూజిక్‌లను మిక్స్ చేసి రెహమాన్ తన పాటలతో మ్యాజిక్ చేస్తాడు. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన రెహమాన్.. ఇలాగే తన పాటలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం..