ఇప్పటివరకు పనోరమా అవార్డు గెలుచుకున్న తెలుగు సినిమాలు

తాజాగా ఈ ఏడాదికి గాను ఇండియన్ పనోరమా అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు సినిమాగా ‘గతం’ నిలిచింది. దీంతో ఇండియన్ పనోరమా అవార్డుల గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అసలు ఇండియన్ పనోరమా అవార్డుల గురించి చాలామందికి తెలియదు. ఈ అవార్డు అంటే ఏంటీ?.. ఇది ఎలాంటి సినిమాలకు ఇస్తారు?. దీని వల్ల ఉపయోగం ఏంటీ? అనే విషయాలు చాలామందికి తెలియవు. దానికి కారణం ఆస్కార్, నేషనల్ అవార్డ్స్‌, ఫిల్మ్ ఫేల్ అవార్డుల తరహాలో ఇండియన్ పనోరమా అవార్డులకు ఎక్కువ పబ్లిసిటీ లేకపోవడమే.

gatham

ప్రేక్షకులకు సినిమా నచ్చితే ఎన్నిసార్లైనా చూస్తారు. నచ్చకపోతే వదిలేస్తారు. కలెక్షన్లు, రికార్డులను అంచనా వేసి సినిమా హిట్ అయిందా?.. ప్లాప్ అయిందా? అని లెక్కలేసుకుంటున్న ఈ రోజుల్లో.. అవార్డుల గురించి ఎక్కువమంది ప్రేక్షకులు పట్టించుకోరు. అయితే డైరెక్టర్లు, నిర్మాతలకు ఇలాంటి అవార్డులే ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలాంటి అవార్డులే మరిన్ని సినిమాలకు తీయడానికి వారిని ప్రోత్సహిస్తాయి. తమ సినిమాకు ఏదైనా అవార్డు వచ్చిందంటే చాలు.. డైరెక్టర్లు, నిర్మాతలు గొప్పగా ఫీల్ అవుతారు.

ఇప్పుడు ఇండియన్ పనోరమా అవార్డుల విషయానికొస్తే.. ఇండియాలోనే సినిమాలకు ఇచ్చే అతి పెద్ద అవార్డు ఇదే. ఇండియన్ సినిమాలకు ప్రోత్సహించేందుకు నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో 1978లో దీనిని ప్రవేపెట్టారు. అప్పటినుంచి ఇండియన్ పనోరమా విభాగం కింద జ్యూరీ సభ్యులు కొన్ని బెస్ట్ సినిమాలను ఎంపిక చేసి ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించే అవకాశం కల్పిస్తారు. IFFI కూడా కొన్ని సినిమాలను నామినేట్ చేసి ఇందులో ప్రదర్శించే అవకాశం కల్పిస్తోంది. దేశ, విదేశాల నుంచి ప్రతి ఏడాది గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో తెలుగు సినిమా ప్రదర్శితమయ్యే అవకాశం దక్కించుకోవడం చాలా పెద్ద గొప్ప అని చెప్పుకోవచ్చు.

ఈ ఏడాది గాను ‘గతం’ సినిమా ఇండియన్ పనోరమా అవార్డు గెలుచుకుని IFFIలో ప్రదర్శితం కానుంది. ఈ ఏడాది జనవరి 16 నుంచి 24 వరకు గోవాలో ఈ ఫెస్టివల్ జరగనుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించగా.. కిరణ్ రెడ్డి డైరెక్షన్‌లో భార్గవ పోలుదాసు, హర్ష ప్రతాప్, సుజన్ ఎర్రబోలు నిర్మించారు. అమెరికాలోని తెలుగువాళ్లు దీనిని తెరకెక్కించగా.. ఈ సినిమా షూటింగ్‌తో పాటు ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అక్కడే జరిగింది. అక్కడ నుంచే అమెజాన్ ప్రైమ్‌లో దీనిని విడుదల చేశారు.

‘గతం’ సినిమా జ్యూరీ కేటగిరీలో చాలా సంవత్సరాల తర్వాత పనోరమా అవార్డు గెలుచున్న తెలుగు సినిమాగా నిలిచింది. గతంలో F2, మహానటి, బాహుబలి, బాహుబలి 2లు పనోరమా అవార్డు గెలుచుకోగా.. వాటిని జ్యూరీ సభ్యులు ఎంపిక చేయలేదు. అవి నేరుగా IFFI ద్వారా నామినేట్ అయ్యాయి. 2011 తర్వాత మొన్నటివరకు ఏ సినిమా జ్యూరీ నుంచి ఇండియన్ పనోరమా అవార్డు గెలుచుకోలేదంటే.. తెలుగు సినిమాల స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం కమర్షియల్ యాంగిల్‌లోనే సినిమాలు తీయడమే దీనికి కారణం. 2011లో విరోధి, 2010లో ప్రస్థానం, 2008లో మీ శ్రేయోభిలాషి, 2006లో హోప్, 2005లో గ్రహణం, 2002లో షో, తిలాద్దనం, 2001లో హిందూస్థాన్ ది మదర్, 2001లో ప్రేమించు సినిమాలు జ్యూరీ కేటగిరీ కింద ఇండియన్ పనోరమా అవార్డు గెలుచుకున్నాయి. 2011 తర్వాత జ్యూరీ నుంచి పనోరమా అవార్డు గెలుచుకున్న తెలుగు సినిమా ‘గతం’ కావడం విశేషం