లాక్‌డౌన్‌లో వలస కార్మికులతో పాటు కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేశాడు సోనూసూద్. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. సహాయం కావాలని ఎవరైనా సోనూసూద్‌ను సోషల్ మీడియా ద్వారా కోరితే చాలు.. ఆయన వెంటనే హెల్ప్ చేసేవారు. అంతేకాకాకుండా ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లు తన దృష్టికి వస్తే సోనూసూద్ వారికి కూడా హెల్ప్ చేసేవారు. లాక్‌డౌన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా.. ఇప్పటికే తన సేవా కార్యక్రమాలు సోనూసూద్ కొనసాగిస్తున్నారు.
సోనూసూద్ నుంచి సహాయం పొందిన ఎంతోమంది ఆయనను దేవునిలా చూసుకుంటున్నారు. దేవునిలా చూసుకోవడమే కాదు.. ఏకంగా తెలంగాణలో సోనూసూద్‌కి గుడి కట్టి పూజలు కూడా చేస్తున్నారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని మద్దూరు మండలానికి చెందిన దుబ్బ తండా పరిధిలోని చెలిమి తండాకు చెందిన రాజేశ్ రాథోడ్ అనే అభిమాని సోనూసూద్‌కు గుడి కట్టించాడు. ఆ గుడిలో సోనూసూద్ విగ్రహం ఏర్పాటు చేసి దేవునిలా పూజలు కూడా చేస్తున్నారు.
సినిమాల్లో సోనూసూద్‌ని చూసి అభిమాని అయ్యాయని, ఇక లాక్‌డౌన్‌లో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చూసిన తర్వాత వీరాభిమాని అయ్యానని రాజేశ్ చెబుతున్నాడు. సోనూసూద్‌కి గుడి కట్టించారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చివరికి ఇది సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో.. దీనిపై స్పందించారు. తాను ఇలాంటి వాటికి అర్హుడిని కాదంటూ నమస్కారం సింబల్‌ను సోనూసూద్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.