బాలీవుడ్‌లోకి విజయ్ ఎంట్రీ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ ఇప్పటివరకు సౌతిండియా హీరోగానే కాదు అందరికీ తెలుసు. కానీ త్వరలో ఆయన పాన్ ఇండియా హీరోగా మారనున్నాడు. దానికి కారణం ప్రస్తుతం ఆయన నటించిన ‘మాస్టర్’ సినిమా హిందీలో కూడా విడుదల కావడమే. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను తొలుత తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు.

master

కానీ ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటివరకు విజయ్ సినిమాలు హిందీలో విడుదల కాలేదు. కానీ తొలిసారిగా ఆయన సినిమా హిందీలో కూడా విడుదల కానుండటం ఆసక్తికరంగా మారింది. సౌతిండియాలోనే టాప్ హీరోగా ఉన్న విజయ్.. ఇక జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

ఇప్పటికే ‘మాస్టర్’ సినిమా టీజర్ విడుదలవ్వగా.. యూట్యూబ్‌లో ఇది ట్రెండింగ్ సృష్టించింది. జనవరి 1న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసే అవకాశముండగా.. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల ఆలస్యమైన విషయం తెలిసిందే. ఒక సమయంలో ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఆ వార్తలు అవాస్తవమని, థియేటర్లలోనే విడుదల చేస్తామని సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది.