బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సినిమా ఏకే వర్సెస్ ఏకే. విక్రమాదిత్య మోత్వనే ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో నటుడు అనిల్ కపూర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డ్రెస్‌లో కనిపిస్తాడు. ఇందులో ఎయిర్‌ఫోర్స్ యూనిఫాంను తప్పుగా చూపించారని, ట్రైలర్లో ఉపయోగించిన పదజాలం బాగాలేదని ఎయిర్‌ఫోర్స్ ట్వీట్ చేసింది.
ట్రైలర్లో చూపించినట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎక్కడా ఇలాంటి నియమాలు కనిపించవని, వెంటనే అభ్యంతరక సీన్లను తొలగించాలని ఎయిర్‌ఫోర్స్ ట్విట్టర్లో పేర్కొంది. ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్ సరిగ్గా లేదని, అంతేకాదు యూనిఫాం డ్రెస్ వేసుకుని వాడిన భాష సరిగ్గా లేదంది. ఈ ట్వీట్‌పై నటుడు అనిల్ కపూర్ స్పందించాడు. తమ సినిమా ట్రైలర్ కొంతమందిని బాధ పెట్టిందని తెలిసిందని, ఎయిర్‌ఫోర్స్ డ్రెస్ ధరించి అలా భాష మాట్లాడినందుకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ట్వీట్ చేశాడు.
ఈ సినిమాను అనురాగ్ కశ్యమ్ నిర్మిస్తుండగా… డిసెంబర్ 24న నెట్‌ఫ్లిక్స్‌లో దీనిని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో వివాదం చెలరేగడంతో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ వివాదంలో చిక్కుకోవడంతో.. సినిమా కూడా వివాదాస్పదంగా మారుతుందనే భయంలో నిర్మాతలు ఉన్నారు. ఇటీవల ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు వివాదంలో చిక్కుకుంటున్నాయి. అలా ఇప్పుడు ఈ సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది.