ఎనిమిదేళ్ల క్రితం బాలు, లక్ష్మీ జంటగా ప్రముఖ నిర్మాత మెయిదా ఆనంద్ రావు నిర్మించిన సినిమా ‘మిథునం’. ఈ సినిమాతో నటుడు, రచయిత అయిన తనికెళ్ల భరణికి డైరెక్టర్గా ఆనంద్ రావు అవకాశం కల్పించారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మంచి సినిమాలు చేయడంలో ఆనంద్ రావు ఎప్పుడూ ముందు ఉంటారు. ఈ సినిమాతో నిర్మాతగా ఆయన సక్సెస్ అవ్వగా.. దీనికి నంది అవార్డు కూడా లభించింది. తెలుగుదనం ఉట్టిపడేలా ఇలాంటి సినిమాలు చేయడమంటే మెయిదా ఆనంద్ రావుకు చాలా ఇష్టం.
ప్రముఖ రచయిత శ్రీరమణ మూలకథతో ఈ సినిమా రాగా.. విశ్రాంత ఉపాధ్యాయుడు అప్పదాసు పాత్రలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నటించగా.. అతని భార్య బుచ్చి లక్ష్మి పాత్రలో సీనియర్ నటి లక్ష్మి నటించారు. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా ఇందులో ఎస్పీ బాలు-లక్ష్మీ అద్భుతంగా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇందులోని పాటలు కూడా ఇప్పటికీ హైలెట్ అని చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్లోకి రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హిందీలో బాలు పోషించిన పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనుండగా.. లక్ష్మీ పాత్రలో రేఖ నటించే అవకాశముంది. అలనాటి రేఖ-అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ అంటేనే ఫేవరెట్. వారిద్దరి కలిసి ఈ సినిమా చేస్తూ అది బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఒకప్పుడు అమితాబ్ బచ్చన్-రేఖలది హిట్ కాంబినేషన్. ఇప్పుడు మళ్లీ చాలాకాలం తర్వాత వీరిద్దరు కలిసి నటించనున్నారు. మిథునం కథ విషయానికొస్తే.. పిల్లలు విదేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ అవుతారు. ఆ సమయంలో వృద్ధాపంలో ఉన్న జంట తమ సొంత ఊరిలో ప్రశాంతంగా తమ జీవితాన్ని ఎలా గడిపారనేది అసలు స్టోరీ. నిజజీవితంలో జరిగే కథలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు.