ఆ మ్యాజిక్ క్రియేట్ అయ్యి 32 ఏళ్లు…

తెలుగు సినిమాకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, హీరో సాలిడ్ గా ఉండాలి ఎలివేషన్ సీన్స్ కావాలి. హీరోయిన్ హీరోకి మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ ఉండాలి, ఒక రెగ్యులర్ కామెడీ ట్రాక్ ఉండాలి. ఇలా మన మేకర్స్ కొన్ని లెక్కలు వేసుకోని సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ లెక్కల్ని చెరిపేస్తూ కొన్ని సినిమాలు ప్రేక్షకులని మెప్పిస్తూ ఉంటాయి. అలాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ లో `గీతాంజలి` ఒకటి. మేకింగ్ మాస్టర్ మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులు ఉండవు, నాగార్జున అల్ట్రా మోడరన్ గ్లామర్ లుక్ లో ఉండడు, సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ లు ఏమీ ఉండవు, హీరోయిన్ అందాల ప్రదర్శన అసలే ఉండదు. ఇవేమి లేకపోయినా గీతాంజలి ఒక క్లాసిక్ గా నిలిచింది. సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీలో హీరో హీరోయిన్ ఇద్దరికీ క్యాన్సర్… వాళ్ల ఇద్దరి మధ్య పుట్టే ప్రేమని మణిరత్నం దృశ్యకావ్యంలా తెరకెక్కించాడు. ఈ మూవీలో`కింగ్` నాగార్జునకి జోడీగా టైటిల్ రోల్ లో గిరిజ యాక్ట్ చేసింది. మేస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ గీతాంజలికి హార్ట్ బీట్ లాంటిది. ఇప్పటికీ ఆ హార్ట్ బీట్ కొట్టుకుంటూనే ఉంది అంటే మ్యాస్ట్రో మ్యాజిక్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. “ఓ ప్రియా ప్రియా“, “ఓ పాపా లాలీ“, “ఆమని పాడవే“, “నందికొండ వాగుల్లోన“, “ఓం నమః“, “జల్లంత కవ్విత“, “జగడ జగడ“.. ఇలా ఈ సినిమాలోని ఏడు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

స్లో రన్ తో బాక్సాఫీస్ లెక్కల ఖాతా తెరిచిన గీతాంజలి, నాగార్జున కెరీర్ లో ఒక మాస్టర్ పీస్ గా నిలిచింది. కలెక్షన్ మాత్రమే కాకుండా గీతాంజలి `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ కథా రచయిత`, `ఉత్తమ హాస్యనటుడు`, `ఉత్తమ నృత్యదర్శకత్వం`, `ఉత్తమ ఛాయాగ్రహణం`, `ఉత్తమ కళాదర్శకుడు` క్యాటగెరీస్ లో `నంది` అవార్డుని కూడా అందుకుంది. `ఉత్తమ దర్శకుడు` విభాగంలో మణిరత్నం `ఫిల్మ్ ఫేర్` అందుకోగా.. `బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మైంట్` కేటగిరిలో `జాతీయ పురస్కారం` సైతం సొంతం చేసుకుంది.