“సమ్మర్ హాలిడేస్” చిత్ర రివ్యూ

ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, బిజిబి ఫిలిమ్స్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మాతలుగా శ్రీకర్ నయన్ రచనా దర్శకత్వంలో నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం సమ్మర్ హాలిడేస్. రోహన్ రాయ్, అరుణ్ దేవ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాయి ప్రకాష్ సినిమా సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించారు. సంతోష్ నాయుడు ఎడిటింగ్ చేసిన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
చదువుకుంటున్న కుర్రాడు ఆర్.వి. ఎప్పుడూ మార్కుల గురించే అడుగుతూ, ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తుంటాడు తండ్రి. ఆర్వీకి మాత్రం క్రికెట్ అంటే ఆసక్తి. ఆ విషయాన్నీ ధైర్యంగా తండ్రితో చెప్పలేని బలహీనత తనది. సంతోషం అన్నదే ఎరుగడు. ఇంతలో వేసవి సెలవులు రావడంతో తల్లితో పాటు తోటవారి పాలెంలోని అమ్మమ్మ ఇంటికి వెళతాడు. అక్కడే కేవీ పరిచయ అవుతాడు. భిన్న ప్రపంచాల్లో పెరిగిన ఇద్దరూ తక్కువ సమయంలోనే మంచి స్నేహితులు అవుతారు. కేవీ పైకి నవ్వుతూ, సరదాగా కనిపిస్తున్నా.. అతని చుట్టూ సమస్యలే. తాగుడుకు బానిసై తండ్రి చనిపోతాడు. అప్పు భారం మీద పడుతుంది. మరోవైపు తనే ప్రపంచంగా బతుకుతున్న తల్లికి ఓ కొత్త చీర కొనిపెట్టాలని ఆశ. అందుకోసం స్కూల్కి వెళుతూనే రోజూ ఇంటింటికీ తిరిగి న్యూస్ పేపర్లు వేస్తుంటాడు. వర్మ తోటలోని కొన్ని మామిడి చెట్లనీ లీజుకు తీసుకుని పంట పండించే ప్రయత్నంలో ఉంటాడు. మరి పంట పండిందా? సమస్యల నుంచి గట్టెక్కాడా? వేసవి సెలవుల్లో అతని జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలేమిటి? కేవీతో స్నేహం చేసిన ఆర్.వి. బలహీనతల్ని ఎలా అధిగమించాడు? కేవీని చూసి ఏం నేర్చుకున్నాడన్నది మిగతా కథ. 2001 నేపథ్యంలో సాగే ఈ కథలో సుమతి ఎవరన్నది ఆసక్తికరం.

చిత్ర విశ్లేషణ :
అమ్మమ్మ ప్రేమగా ఆవకాయ కలిపి తినిపించిన గోరు ముద్దలు, రాత్రి కరెంట్ పోగానే దాబా పైకి తీసుకెళ్లి చెప్పిన కథలు, అమ్మమ్మ ఊళ్లోని మామిడి తోటలు, అందులో కొబ్బరిమట్టల్ని క్రికెట్ బ్యాట్లా చేసుకుని ఆడిన మ్యాచ్లు, ఆ పక్కనే చెరువు, తోటి పిల్లలంతా కలిసి అలుపెరగకుండా గంటలకొద్దీ కొట్టిన ఈత, ఇవన్నీ ఎంతోమందికి ఎప్పటికీ మరపురాని జ్ఞాపకాలు. వీటిలో అన్నీ కాకపోయినా కొన్నయినా అనుభవించిన వాళ్లు చాలామందే ఉంటారు. ఆ జ్ఞాపకాలన్నిటినీ మరోసారి గుర్తు చేసే హృద్యమైన చిత్రమిది. అలాగని ఇది కేవలం గత స్మృతుల్ని గుర్తు చేయడానికే పరిమితం కాలేదు. స్వచ్ఛమైన స్నేహంతో ముడిపడిన కథ ఇందులో ఉంది. ప్రధాన పాత్రధారులు చిన్నారులే అయినా, ఆ పాత్రల్లో పెద్దలందరూ తమని తాము చూసుకుంటారు. ఎక్కువగా హింస, రక్తపాతమే తెరపై కనిపిస్తున్న ఈ తరుణంలో.. పచ్చటి పల్లెటూరి నేపథ్యం, స్వచ్ఛమైన మనుషులు, భావోద్వేగాలతో మనసులకు హాయిని పంచుతుందీ చిత్రం.

ఆర్వీకీ, తన తండ్రికీ మధ్య సన్నివేశాలతో సినిమా ఆరంభమైనా, అమ్మమ్మ ఊరికి కథ చేరగానే ఆ ప్రపంచంలో లీనం చేస్తుందీ చిత్రం. ఇక ఆర్వీ, కేవీ కలిసినప్పట్నుంచి సందడే సందడి. వాళ్లు ఆడే క్రికెట్, ఇద్దరి మధ్య స్నేహం, సరదాలు, ఒకరి సమస్యల్ని మరొకరు తెలుసుకోవడం, ఆ తర్వాత ఒకరికొకరు సాయం చేసుకునే సన్నివేశాలతో సినిమా పరుగులు పెడుతుంది. కేవీ లీజుకు తీసుకున్న మామిడి చెట్లతో ముడిపెడుతూ ఇద్దరి స్నేహితుల కథని నడిపిన తీరు చాలా బాగుంటుంది. విరామ సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి. ద్వితీయార్ధం కథ చాలావరకూ ఊహకందేలా సాగినా, అమ్మమ్మ ఇంట్లో ఆర్వీ పుట్టినరోజు వేడుకలు, అక్కడ తోటి చిన్నారులు చేసే అల్లరి పనులు, కేవీ పండించిన మామిడి పంట, దాన్ని మార్కెట్కి తరలించడం, తల్లికి చీర కొనాలన్న కల నెరవేర్చే సందర్భం.. ఇలా మనసుల్ని హత్తుకునే ఘట్టాలుంటాయి. పతాక సన్నివేశాలు మరింత హృద్యంగా సాగుతాయి. అమ్మమ్మ ఊరి నుంచి తిరిగి వెళ్లే సందర్భంలో ఆర్వీలో కనిపించే మార్పు, తండ్రితో చెప్పే మాటలు చిత్రానికి ప్రధాన బలం.

కేవీ, సుమతి పాత్రలతో కథకు సరైన ముగింపుని ఇచ్చాడు దర్శకుడు. నిన్నటి తరానికేమో తాము గడిపిన బాల్యాన్ని మరోసారి కళ్లకు కట్టి గత జ్ఞాపకాల్లో విహరింపజేసేలా చేస్తుంది. కథే అతిపెద్ద తారలా, మనవైన మూలాలు, విలువలతో రూపొందిన ఇలాంటి సినిమాలకు ఆదరణ దక్కాలి. అక్కడక్కడా నెమ్మదిగా అనిపించినా, అడుగడుగునా ఉట్టిపడే సహజత్వంతో, అమ్మమ్మ ఊరికి వెళ్లొచ్చినట్టుగా ఓ గొప్ప అనుభూతిని పంచుతుందీ చిత్రం.

నటీనటుల నటన :
రోహన్, అరుణ్ దేవ్ పాత్రల చుట్టూనే ఈ సినిమా సాగుతుంది. ఇద్దరూ పాత్రల్లో ఒదిగిపోయారు. అమాయకత్వంతోపాటు, హాస్యం, భావోద్వేగాల్ని పక్కాగా పండించారు. బేబి ఖుషితో పాటు, పలువురు బాల నటులు ఇందులో చేసిన సందడి ఆకట్టుకుంటుంది. అమ్మమ్మ పాత్రకు జయసుధ ప్రాణం పోశారు. హర్షిణికి ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యమున్న కేవీ తల్లి పాత్ర దక్కింది. ఆమెతో పాటు, ఆర్వీ తల్లిదండ్రులుగా వాసుకి, హర్షవర్ధన్ సహజమైన నటనతో పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. వర్మ పాత్రలో రాజీవ్ కనకాల మెప్పిస్తారు. వీళ్లందరికంటే ఇందులో మరో కీలక పాత్ర ఉంది. అదే మామిడి చెట్టు. కథంతా ఆ చెట్టు చుట్టూనే సాగుతుంది. సాంకేతికంగా విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. పల్లెటూరి అందాల్ని చక్కగా చూపించారు ఛాయాగ్రాహకుడు సాయిప్రకాశ్. సింజిత్ స్వరపరిచిన పాటలు చిత్రానికి ప్రధాన బలం. చాలాచోట్ల నేపథ్య సంగీతంతో సన్నివేశాల్ని మరోస్థాయికి తీసుకెళ్లారు. ఇతర విభాగాలూ మంచి పనితీరుని కనబరిచాయి. దర్శకుడు శ్రీకర్ నయన్కు ఇదే తొలి చిత్రమైనా, ఎంతో స్పష్టతతో, నిజాయతీగా కథ చెప్పారు. మోతాదు తక్కువే అయినా, అక్కడక్కడా హాస్యం, భావోద్వేగాలు బాగా పండాయి. ఇలాంటి ఓ కథని నమ్మి నిర్మించడం అంత సులువు కాదు. నిర్మాతల ప్రయత్నం మెచ్చుకోదగ్గది.

ప్లస్ పాయింట్స్ :
కథ, పల్లెటూరి నేపథ్యం, నటీనటుల నటన, సంగీతం, హాస్యం, ఎమోషన్స్

మైనస్ పాయింట్స్ :
ఊహకందే కథ, స్క్రీన్ ప్లే

సారాంశం :
పిల్లలు, పెద్దలు కలిసి చూడాల్సిన ఒక మంచి ఫీల్ గుడ్ చిత్రం సమ్మర్ హాలిడేస్.

Related Articles

Latest Articles