National Flog: భారత జాతీయ పతాకం ఆవిష్కరణ నేటితో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతీయులను తలెత్తుకునేలా చేసింది ఆ పతాకం. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా జాతీయ పతాకం రెపరెపలాడింది.. 1921లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించింది. అయితే పలు రాజకీయ పార్టీలు రూపొందించిన జాతీయ పతాకాలు సామాన్య ప్రజల్లో ఆదరణ పొందలేదు.. కానీ పింగళి వెంకయ్య గారు రూపొందించిన పతాకం జాతీయోద్యమ పతాకంగా మారింది. ఈ జాతీయ పతాకాన్ని 1921 మార్చి 31న బెజవాడ విక్టోరియా మహల్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జాతిపిత మహాత్మాగాంధీకి పింగళి వెంకయ్య అందజేశారు. అయితే 1906లో కోల్‌కతాలో ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్‌గా పిలిచే దాదాబాయి నౌరోజి అధ్యక్షతన 22వ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగాయి.
ఆ సభలో బ్రిటీష్ పతాకం యూనియన్ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి వచ్చింది. దీంతో కలత చెందిన పింగళి వెంకయ్య ప్రత్యేకంగా జాతీయ జెండా ఎందుకు ఉండకూడదనే విషయాన్ని సభలో ప్రస్తావించారు.. అనంతరం జాతీయ జెండా ఆవశ్యకత వివరిస్తూ దేశవ్యాప్తంగా పర్యటించి 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే ఆంగ్ల పుస్తకం రచించారు. కానీ జాతీయ పతాకాన్ని రూపొందించిన ఆ మహోన్నత వ్యక్తికి ఇప్పటివరకు కూడా భారతరత్న ఇవ్వలేదు.. దీంతో పలు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.